నిజామాబాద్, జూన్ 30, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో విధంగా మోసం చేస్తోంది. పెట్టుబడి సాయం ఎకరానికి ఏటా రూ.15వేలు అందిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. గద్దెనెక్కిన తర్వాత రైతుభరోసా పథకాన్ని అమలు చేయడంలో అడుగడుగునా వైఫల్యం చెందుతోంది. ఏ సీజన్లో ఎన్ని ఎకరాలకు పెట్టుబడి సాయం వస్తుందో? అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. గత యాసంగి సీజన్లో నేడు, రేపు అంటూ లీకులు ఇచ్చి, రైతులను మభ్యపెట్టి మే నెలలో పెట్టుబడి సాయం నగదును అందించారు. అందరి కాకుండా కొందరికే రెండు విడుతల్లో కేవలం 2 ఎకరాల భూములకే రైతుభరోసా పరిమితం చేశారు. మిగిలిన భూ విస్తీర్ణానికి రైతుభరోసా అందిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ అమలు కాలేదు. అంతలోనే వానాకాలం సీజన్ మొదలై నెల గడుస్తోంది. పెట్టుబడి ఖర్చుల కోసం కర్షకులు ఎదురు చూస్తుండగా నగదు సాయం పేరుతో మరోసారి మోసాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపింది. హైదరాబాద్‌లో మంగళవారం పెట్టుబడి సాయం నిధులు విడుదల చేసినప్పటికీ కేవలం 2 ఎకరాలకే పరిమితం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ పాలనలో ఠంచనుగా రైతుబంధు పథకం అమలైంది. కోతలు పెట్టకుండానే నగదు జమ చేశారు. కానిప్పుడు రేవంత్ రెడ్డి పూటకో విధంగా రైతుభరోసా పథకం ఉద్ధేశాన్ని, స్కీమ్ రూపాన్ని మార్చేస్తుండడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 10లక్షల 89వేల ఎకరాల సాగు భూములున్నాయి. ఒక సీజన్లో ఎకరానికి రూ.6వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తే ఉభయ జిల్లాలోని 5లక్షల 39వేల 969 మంది రైతులకు దాదాపుగా రూ.653.40 కోట్లు నిధులు అవసరం అవుతుంది. కానీ ప్రతి రైతుకు రెండు ఎకరాలకే ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేయడంతో సర్కారు నిర్ణయం చిన్న, సన్నకారు రైతులకు ఊరట ఇవ్వడం లేదు. నిజామాబాద్ జిల్లాలో 2లక్షల 60వేల 617 మంది రైతులున్నారు. వీరి పరిధిలో దాదాపుగా 5లక్షల 30వేల ఎకరాల్లో పంటలు సాగుకు నోచుకోబోతున్నట్లుగా వ్యవసాయ శాఖ అంచనాలే చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 2లక్షల 79వేల 352 మంది రైతులుంటే వీరి పరిధిలో 5లక్షల 59వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లుగా వ్యవసాయాధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు పంట కాలాలు వచ్చాయి. ఇందులో పూర్తి స్థాయిలో రైతుభరోసా అందించిన దాఖలాలే లేవు. మధ్యలో రెండు విడుతల్లో పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు. ఆ తర్వాత సగం మంది రైతులకు శఠగోపం పెట్టారు. ఇష్టమొచ్చినట్లుగా విస్తీర్ణానికి సంబంధం లేకుండానే నగదు జమ చేశారు. గత యాసంగిలో నమ్మించి నట్టేట ముంచారు. అరకొరగా సాయం చేసి భారీగా ప్రచారం చేసుకుంటుండడంపై రైతులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో రైతులకు మోసం మీద మోసమే ఎదురవుతోంది. ప్రతి పంట కాలంలో దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా దుస్థితి ఏర్పడింది. యూరియా కోసం క్యూలైన్లలో నిలబడి, యాప్‌తో కష్టాలు పడి సాధించాల్సి వస్తోంది. మూడు విడుతల్లో వచ్చే యూరియా సంచుల కోసం పొలాలను వదిలి ఎరువుల దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. సాగుకు నీళ్లు లేవు. కాలువలు బీడు బారుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను ఆదుకునే ఆలోచన రేవంత్ రెడ్డి సర్కారు చేయడం లేదు. వానాకాలంలో వర్షాలపైనే రైతులంతా ఆధారపడ్డారు. ఎల్‌నినో ప్రభావంతో వానలు మొఖం చాటేస్తున్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మూలకు పడేయడంతో రైతులకు వరుణ దేవుడు మినహా కాంగ్రెస్ సర్కారు ఆదుకోవడం కష్టంగానే దాపురించింది. ఇన్ని కష్టాల మధ్య కొట్టుమిట్టాడుతున్న రైతుకు పెట్టుబడు సాయం సరిగా ఇవ్వడం లేదు. ఎట్టకేలకు సీజన్ ప్రారంభమైన నెల రోజులకు నిధులు విడుదల చేసినప్పటికీ కేవలం 2 ఎకరాలకే నగదు జమ చేయడంపై మండిపడుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చిన్న కమతాల్లోనే వ్యవసాయం చేస్తోన్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతులే అధిక శాతం మంది ఉన్నారు. వీరి చేతుల్లో గరిష్టంగా 5 ఎకరాల్లోపు భూములు ఉన్నాయి. కేవలం 2 ఎకరాలకే పెట్టుబడి సాయం ఇస్తే మిగిలిన వాటికి ఎప్పుడు ఇస్తారో? తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.