కామారెడ్డి, అక్టోబర్ 9: ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కచ్చితంగా అమలు చేసేందుకు నోడల్ అధికారులు, తహసీల్దార్లు, వివిధ బృందాలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 24 గంటల్లోగా ప్రభుత్వ భవనాలపై రాజకీయ పార్టీలకు చెందిన పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, జెండాలను వెంటనే తొలగించాలని, విగ్రహాలకు ముసుగు వేయాలని సూచించారు. పబ్లిక్ స్థలాల్లో ఉన్న వాటిని 48 గంటల్లోగా, ప్రైవేటు స్థలాల్లో ఉన్న వాటిని 72 గంటల్లోగా తొలగించాలని పేర్కొన్నారు. ప్రగతిలో ఉన్న పనులు కొనసాగిస్తూ, ప్రారంభంకానివి, టెండర్ దశలో ఉన్నవాటిని మొదలు పెట్టొద్దని, వాటి జాబితాను 72 గంటల్లోగా అందజేయాలని ఆదేశించారు. మీడియా సర్టిఫికేషన్ ఉంటేనే కరపత్రాలు, పోస్టర్లను ముద్రించాలని అన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల నోడల్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
స్వేచ్ఛగా ఓటేయాలి..
ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌తో కలిసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సంఘం నవంబర్ 3న షెడ్యూల్ ప్రకటిస్తుందని, 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 13న పరిశీలన, 15న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తుందని అన్నారు. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని, 5న ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. జిల్లాలోని కామారెడ్డి,ఎల్లారెడ్డి,జుక్కల్ నియోజకవర్గాల్లో 6,61,163 మంది ఓటరులు ఉన్నారని, ఇందుకోసం 791 పోలింగ్ కేంద్రాలు,75 రూట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మహిళలు, దివ్యాంగుల కోసం ప్రతి మండలంలో ఒక మాడల్ పోలింగ్ కేంద్రంతోపాటు యువతను ప్రోత్సహించేందుకు మాడల్ పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లాలో ఓటింగ్ శాతం అధికంగా ఉన్నదని, కాగా పట్టణ ప్రాంతాల్లోని వారు ముందుకు వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవరైనా ఓటర్లకు ప్రలోభాలు పెట్టి, భయపెడితే నేరంగా పరిగణిస్తామని అన్నారు. నిబంధనల ప్రకారం అభ్యర్థి రూ.40లక్షలకు మించి ఖర్చు చేయరాదని అన్నారు. అసత్య వార్తలు వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత మీడియాపై ఉన్నదని తెలిపారు.