Robbery gang | వినాయక నగర్, జూలై 14 : తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్ రెండు జిల్లాల్లో గత మూడు రోజుల క్రితం దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా మన పోలీసులకు చిక్కకుండా చేజారిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి అనంతరం నుండి శనివారం తెల్లవారుజాము వరకు నిర్మల్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణం, మాక్లూర్ మండలంతోపాటు నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని దుబ్బ ప్రాంతంలో వరుస చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా వచ్చిన టాటా సుమో మహారాష్ట్ర ప్రాంతంలోని ఓ చోట దొంగతనం చేసి తీసుకువచ్చిందిగా పోలీసుల దర్యాప్తులో తేలింది. వారు వచ్చిన టాటా సుమో వాహనం ఆర్మూర్ పట్టణంతోపాటు నిజామాబాద్ నగరంలో సైతం పలు ప్రాంతాలలో సీసీ కెమెరాలకు చిక్కింది. దొంగిలించిన వాహనంలో మొత్తం ఆరుగురు గ్యాంగ్ వచ్చినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. .\
ఈ చోరీలపై సీరియస్ గా పరిగణించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అంతర్ రాష్ట్ర ముఠాను పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం నుండే నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రత్యేక పోలీసు బృందాలు తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు మహారాష్ట్రకు సైతం వెళ్లి దుండగుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ అంతరాష్ట్ర ముఠా సభ్యులు మన జిల్లా పోలీసులకు పట్టు పడకుండా ఇక్కడ నుండి నేరుగా మహారాష్ట్ర ప్రాంతానికి పరారయ్యారు. ఆ ప్రాంతంలో నీవు చోట వారు ప్రయాణం చేసిన టాటా సుమో దొంగిలించిన వాహనాన్ని వదిలేసి, అక్కడి నుండి మరో (బొలెరో) వాహనాన్ని దొంగిలించి ఆ వాహనంలో అక్కడి నుండి పరారయ్యారు. ఆదివారం రాత్రి మహారాష్ట్రలోని హైమద్ నగర్ జిల్లా ఒట్టురు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గోల్డ్ షాప్ లో సైతం మరో దోపిడీకి పాల్పడినట్లు సమాచారం.
అక్కడినుండి మరోచోట ఓ ఇంట్లో చోరీకి యత్నించగా, అప్పటికే నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారుల సమాచారంతో అప్రమత్తమైన మహారాష్ట్ర పోలీస్ బృందాలు చివరకు ఆ దోపిడీ దొంగలను అక్కడ పట్టుకున్నట్లు తెలిసింది. మహారాష్ట్ర పోలీసులకు పట్టుబడిన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే రెండు రోజులపాటు రాత్రింబవళ్లు అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన నిజామాబాద్ జిల్లా పోలీసులకు చివరకు నిరాశే మిగిలింది. నిజామాబాద్ జిల్లా పోలీసులకు దోపిడీ ముఠా పట్టుబడి ఉంటే, ఇక్కడ చోరీల లో దొంగిలించిన సొత్తు రికవరీ అయ్యేదని, ప్రస్తుతం వారు మహారాష్ట్ర పోలీసుల అదుపులో ఉండడంతో మన దగ్గర జరిగిన చోరీల సొత్తు రికవరీలో టైం పడుతుందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్ర జైల్లో ఉన్న నిందితులను కోర్టులో పిటిషన్ వేసి, నిజామాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని, వారిని విచారించి అనంతరం వారి ద్వారా చోరీ సొత్తును రికవరీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.