నిజామాబాద్, జనవరి 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కంఠేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాల తీరుతెన్నులపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులతో ఆదివారం నిర్వహించిన సమన్వయ సమావేశం సమాధానం లేని సమీక్షగానే ముగిసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులంతా హాజరైన ఈ మీటింగ్ ఆద్యంతం వాడీవేడిగా సాగింది. మూడు గంటల సమావేశంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా అడుగడుగునా ఆయా పథకాల లబ్ధిదారుల గుర్తింపులో లోపాలు, సమస్యలను ఎత్తి చూపారు. వాటిపై జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సావధానంగా విని, చివరగా సమాధానాలు చెప్పినప్పటికీ వాటిల్లో స్పష్టత కొరవడిందని సమీక్షకు హాజరైన వారంతా అభిప్రాయపడ్డారు.
ప్రధానంగా ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ నాయకులకే చోటు కల్పించారని, తాము ప్రతిపాదించిన వ్యక్తులను పక్కకు పెట్టారంటూ ఎమ్మెల్యేలు చెప్పారు. దీనిపై మంత్రి క్లారిటీ ఇవ్వలేదు. పథకాలకు అర్హుల గుర్తింపులో ప్రస్తుతం ఉన్న ఆదాయ పరిమితిని పెంచాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగా.. జూపల్లి స్పందించలేదు. ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా విషయంపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు సంధించగా… ఒక్క టిప్పర్ కూడా అక్రమంగా తిరగడం లేదంటూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బదులిచ్చారు. కాగా ఇన్చార్జి మంత్రి ఈ విషయంపై నోరు మెదపకపోవడంపై చర్చ జరిగింది. సంక్రాంతి రోజు నిర్వహించిన పసుపు బోర్డు ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమం మాదిరిగా జరిగిందని ఎమ్మెల్సీ కవితతోపాటు ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆక్షేపించారు. ఈ విషయంపై కేంద్రానికి లేఖ సంధించాలని నేతలు చెప్పగా.. మంత్రి జూపల్లి నోరు విప్పలేదు. కామారెడ్డి వ్యవసాయధికారి తిరుమల ప్రసాద్ తీరుపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గడబిడ గందరగోళం..
ఉమ్మడి జిల్లా ప్రభుత్వాధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశం కాస్తా గడబిడ గందరగోళం అన్నట్లుగా సాగింది. వేదికపై ప్రొటోకాల్ పాటించలేదు. మేయర్‌కు సరైన స్థానం కల్పించలేదు. ఉమ్మడి జిల్లా సమన్వయ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులతోపాటు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయాధికారులు సైతం హాజరు కావాల్సి ఉండగా.. చాలా మంది జిల్లా అధికారులు, మండల స్థాయి బాధ్యులు డుమ్మా కొట్టారు. సమన్వయ సమావేశం ఆద్యాంతం వేదికపై ఉన్న అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రసంగానికే సరిపోయింది.
సమన్వయ సమావేశానికి వచ్చిన అధికార యంత్రాంగమంతా కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఏ ఒక్క శాఖకు సంబంధించిన అధికారిని వివరణలు అడుగకపోవడంతో వచ్చిన వారంతా ఫోన్లలో చిట్‌చాట్ చేస్తూ కాలక్షేపం చేశారు. సెలవు దినం రోజున మీటింగ్ పెట్టడం, మూడు గంటల భేటీలో యంత్రాంగం పనితీరుపై ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమీక్షించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. సమావేశ మందిరంలోనూ వారు మోహరించారు.
చతురత ప్రదర్శించిన కవిత, వేముల..
ఉమ్మడి జిల్లా సమన్వయ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తమ చతురతను ప్రదర్శించారు. అధికారిక కార్యక్రమంలో తమదైన తీరులో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీశారు. సమావేశం ఎజెండా మేరకు పథకాల అమలులోని లోపాలను ఎత్తి చూపారు. ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. హుందాగా, మర్యాదగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను సంభోదిస్తూ కవిత, వేముల తమ ప్రసంగాన్ని కొనసాగించారు. తీవ్రమైన సమస్యలను ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకురావడంతో పాటు తమదైన శైలిలో అధికార పార్టీపై వాగ్బాణాలు సంధించారు. నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్‌కు సరైన ప్రొటోకాల్‌ను అధికారులు పాటించలేదు.
సబ్ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఉన్నతాధికారుల పీఏలు, గన్మెన్లతో సభా వేదిక నిండుకోవడంతో అస్తవ్యస్తంగా కనిపించింది. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి తన ప్రసంగం మొదలు పెట్టడంతోనే రాజకీయ వ్యాఖ్యానాలు జోడించారు. మంత్రిని కేర్లెస్ అంటూ మాట్లాడడంతో కాస్త రగడ చోటు చేసుకున్నది. మంత్రి జూపల్లి కృష్ణారావును కేర్లెస్ అంటూ వ్యాఖ్యానించడంతో కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. మంత్రితో జాగ్రత్తగా మాట్లాడాలంటూ హితవు పలికారు.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
ఉభయ జిల్లాల విషయమై ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు పలు ప్రశ్నలు సంధించారు. అందుకు ఆయన సమాధానం చెప్పకపోవడం గమనార్హం. నిజామాబాద్‌లో 1.27లక్షల మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా.. కేవలం 26వేల మందికే ఇస్తామనడం సరికాదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేయాలని, 4.43 లక్షల మంది రైతు కూలీలు ఉంటే కేవలం 41వేల మందికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుందని చెప్పడం సరికాదన్నారు. పథకాల ఎంపికలో రాజకీ జోక్యం తగదని హితవు పలికారు. పోలీసు కమిషనర్ లేకపోవడంతో శాంతి, భద్రతలు క్షీణిస్తున్నాయని, సీపీని ఎప్పు నియమిస్తారని ప్రశ్నించారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తామని, ఇప్పుడు కేవలం రూ.12వేలు ఇవ్వడం రైతులను మోసం చేయడమే అన్నారు. అంగన్వాడీలకు నెలకు రూ.13,500జీతం వస్తున్నదని, వీరి సంవత్సర ఆదాయం రూ.1,62,000కావడంతో రేషన్ కార్డుకు అర్హత కోల్పోతున్నారు. ఇలా చాలా మంది చిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నదన్నారు. కామారెడ్డి వ్యవసాయాధికారి రుణమాఫీపై ఎమ్మెల్యేలకే సరైన సమాచారం ఇవ్వడం లేదని, ఆయనపై ఇన్చార్జి మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.