మాచారెడ్డి,మార్చి 1 : మాచారెడ్డి మండలంలోని లక్ష్మీరావులపల్లి, పాల్వంచ మండలంలోని బండరామేశ్వర్‌పల్లి గ్రామశివారులో ఉన్న భారీ ఇసుక డంపులను రెవన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు. ‘వాగులనూ తోడేస్తున్నారు..’ అనే శీర్షికన ప్రచురించిన నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి కామారెడ్డి టాస్క్‌ఫోర్స్, రెవెన్యూ అధికారులు స్పందించారు. మండలంలోని ఇసుక డంప్‌లపై దాడిచేశారు. లక్ష్మీరావులపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 465లో పొలం వద్ద సుమారు 40 ట్రాక్టర్ల ఇసుక డంప్‌ను టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. బండరామేశ్వర్‌పల్లి గ్రామ శివారులో 20 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంప్‌ను పాల్వంచ ఇన్చార్జి తహసీల్దార్ లక్ష్మణ్ సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుక డంప్‌లకు 3వ తేదీన వేలం వేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. అసక్తి ఉన్న వారు వేలంలో పాల్గొనాలని సూచించారు.
కామారెడ్డి నుంచి ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ అధికారులు వచ్చి మండలంలో ఇసుక డంపులను గుర్తిస్తున్నా.. స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం కార్యాలయం నుంచి కాలు కదపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి అధికారులకు ఏ ప్రాంతంలో ఇసుక డంప్ చేశారో ఎందుకు తెలియడం లేదని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని దాడులు నిర్వహిస్తే మండలంలోని వారు పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో మరిన్ని భారీ ఇసుక డంప్‌లు లభిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మండలంలో ఉన్న ఇసుక డంపులపై వరుస కథనాలు వస్తున్నా.. రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. ఉన్నతాధికారులు ప్రశ్ని స్తే వివరణ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు కానీ గ్రామాల్లో తనిఖీలు చేపట్టడం లేదు. దాడిచేసి డంపులపై తనిఖీలు నిర్వహించడం లేదు. కలెక్టర్ స్పందించి ప్రత్యేకంగా విచారణ అధికారిని నియమిస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.