బోధన్ రూరల్/రుద్రూర్, జూన్ 5: రైతు ఇచ్చే ప్రతి దరఖాస్తునూ స్వీకరించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులకు సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలువాలని పేర్కొన్నారు. సాలూరా మండల కేంద్రంతోపాటు రుద్రూర్ మండలం రాణంపల్లిలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులను గురువారం పరిశీలించారు.
అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా..? తదితర అంశాలపై ఆరా తీశారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రతగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో వివరాలను నమోదుచేయాలని ఆదేశించారు.
దరఖాస్తుల స్వీకరణ హెల్ప్‌డెస్క్‌లు, రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యల వారీగా ఆర్జీలను విభజిస్తూ పక్కాగా రికార్డులను పొందుపర్చాలని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని తెలిపారు.
ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఈ విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తుదారులను పదే పదే తిప్పుకోకూడదని, సదస్సులో అర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ తారాబాయి, సిబ్బంది ఉన్నారు.