సారంగాపూర్, ఫిబ్రవరి 6: నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన చప్పగా సాగింది. మండలంలోని కేశాపూర్ శివారులో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట కార్యక్రమం సాదాసీదాగా కొనసాగింది. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి, సాయంత్రం 4.30 గంటలకు సభావేదిక వద్దకు చేరుకున్నారు. అయితే, వివిధ ప్రాంతాల నుంచి మహిళలను మధ్యాహ్నం 12 గంటలకే కాంగ్రెస్ నాయకులు తరలించారు.
దాదాపు నాలుగు గంటలకు పైగా సభా ప్రాంగణంలో వేచి ఉన్న మహిళలు.. ఎంతకీ మీటింగ్ ప్రారంభం కాకపోవడంతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా వెళ్లిపోతున్న వారిని పలుకరిస్తే నాలుగు గంటల పాటు ఎదురుచూసీ చూసీ విసుగెత్తి వెళ్తున్నామని చెప్పారు. అయినా వారు (కాంగ్రెస్ నేతలు) ఇచ్చే రూ.200 కోసం పొద్దంతా ఇక్కడనే ఉండాలా? సీఎం వచ్చి పోయినంక మేము పోవాలంటే రాత్రి అయితది. అట్లా ఎట్ల కుదురతదని ప్రశ్నించారు.
సాయంత్రం 4.30 గంటలకు స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రారంభ ఉపన్యాసం చేస్తున్న సమయంలో, ఆ తర్వాత ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ప్రసంగిస్తున్నప్పుడు కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఇంటిదారి పట్టారు. చివరికి సీఎం ప్రసంగిస్తున్న సమయంలోనూ మహిళలు గుంపులు గుంపులుగా అక్కడి నుంచి వెనుదిరిగారు. మరోవైపు అతిథుల ప్రసంగాలు చప్పగా సాగడం, పెద్దగా ఆకట్టుకునే రీతిలో ఎవరూ మాట్లాడకపోవడంతో ప్రజలు వెళ్లిపోయారు. వేదిక మీద నుంచి నాయకులు చేసిన ప్రసంగాలు సభికులను ఆకట్టుకోలేకపోయారనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమయ్యాయి.