నిజామాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలనలో అత్యంత ముఖ్యమైన గ్రూప్ 1 సర్వీస్ నియామకాలు తీవ్ర వివాదాలకు గురైంది. 2024 అక్టోబర్‌లో జరిగిన మెయిన్స్ పరీక్షలు, 2025 మార్చిలో విడుదలైన ఫలితాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) అసమర్ధత, నిబంధనల ఉల్లంఘనలకు చిహ్నాలుగా మారాయి. మెయిన్స్ ఫలితాలపై హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన స్టే తీర్పు తదనంతరం ద్విసభ్య ధర్మాసనం స్టేను ఎత్తేయడంతో వెలుగు చూసిన పర్యావసానాలతో యువతీ, యువకుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టేసినట్లుగానే కనిపిస్తోంది.
అందుకు అక్టోబర్ 31న తెలంగాణ హైకోర్టు వెలువరించిన సంచలన నిర్ణయమే ఉదాహారణగా నిలుస్తోంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో 13ఏళ్ల క్రితం(ఉమ్మడి రాష్ట్రంలో) నియాకమైన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలను హైకోర్టు రద్దు చేసింది. కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేసుకోవాలని టీయూ వీసీ, రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇచ్చింది. రోస్టర్ పాయింట్లలో అవకతవకలు, రిజర్వేషన్లు అమలులో లోపాలతో ఇప్పుడు 45 మంది ఆచార్యుల ఉద్యోగాలు రద్దు కాబడ్డాయి.
గ్రూప్ 1 నియామకాల్లోనూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇదే రకమైన తీర్పును వెలువరించింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు చెల్లుతాయని చెప్పడం ద్వారా భవిష్యత్తులో ఏం జరుగుతుందోనన్న భయం ప్రతి ఒక్కరిలోనూ వెంటాడుతోంది. టీయూలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు రద్దు చేసినట్లే గ్రూప్ 1 నియామకాల విషయంలోనూ పునరావృతం అవుతుందా? తేలాల్సి ఉంది. తుది తీర్పు రాకముందే రేవంత్ రెడ్డి సర్కారు నియామక ప్రక్రియను పూర్తి చేయడంతో ఉద్యోగాల్లో చేరిన వారి భవిష్యత్తుపై నీలినీడలు అలుముకుంటున్నాయి.
గ్రూప్ 1 నియామకాలు ఉంటాయా? ఊడతాయా?
న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డప్పుడు వాటిని తొలగించుకున్న తర్వాతే నియామక ప్రక్రియను పూర్తి చేయాలి. తద్వార ఎవ్వరికీ ఇబ్బందులు ఎదురుకావు. కానీ గ్రూప్ 1 నియామకాల విషయంలో పంతాన్ని నెగ్గించుకునే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన తప్పిదాలు చేస్తోంది. 2024, అక్టోబర్ 21-27 మధ్య మెయిన్స్ పరీక్షలు జరిగాయి. మార్చి 10, 2025న మెరిట్ జాబితా విడుదలైంది. కానీ జవాబు పత్రాల మూల్యాంకనంలో గందరగోళం చోటు చేసుకోవడంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘంగా విచారించిన తర్వాత హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం సెప్టెంబర్ 9, 2025న మెరిట్ లిస్ట్‌ను రద్దు చేసి మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం లేదా పునఃపరీక్షకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ తీర్పుపై టీజీపీఎస్సీ మొండిగా ముందడుగు వేసింది. కోర్టు తీర్పును సమీక్షించుకోకుండా ద్విసభ్య ధర్మాసనానికి అప్పీల్ చేసింది. సెప్టెంబర్ 24న ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసి 563 మంది అభ్యర్థులకు ప్రొవిజినల్ అపాయింట్మెంట్స్ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇదంతా తుదితీర్పునకు లోబడి నియామకాలు చెల్లుబాటు అవుతాయని ధర్మాసనం పేర్కొంది. రాత్రికి రాత్రి ఫలితాలు వెల్లడించి రోజుల వ్యవధిలోనే నియామక పత్రాలు ఇచ్చేసి మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఉద్యోగాలను కేటాయించింది.
ఈ గ్రూప్ 1 నియామకాలు తుది తీర్పుపైనే ఆధారపడి ఉండటంతో 563 మంది అభ్యర్థుల ఉద్యోగాల మనుగడపై కత్తి వేలాడుతున్నట్లే కనిపిస్తోంది. ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన స్టేను ఎత్తివేయడం తాత్కాలికంగా ఊరటను ఇచ్చినప్పటికీ ఫైనల్ జడ్జిమెంట్‌పైనే నియామకాలు ఆధారపడటంతో ఉద్యోగాలు పొందిన వారిలో పూర్తి స్థాయిలో ఆనందం లేకుండా పోయింది. తెలంగాణ యూనివర్సిటీ మాదిరిగా గ్రూప్ 1 నియామకాలు రద్దు అయితే పరిస్థితి ఏమిటి? అన్నది అంతు చిక్కడం లేదు. యువత భవిష్యత్తుతో రేవంత్ రెడ్డి సర్కారు చెలగాటం ఆడుతోందని న్యాయ నిపుణులు అంటున్నారు.
కీలక తీర్పులు ఏం చెబుతున్నాయి?
తెలంగాణ యూనివర్సిటీలో 2012 నోటిఫికేషన్ల ఆధారంగా జరిగిన నియామకాలు, 2024 గ్రూప్ 1 నియామకాల్లో అనేక సారూప్యతలు కనిపిస్తున్నాయి. టీయూ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ప్రభుత్వానికి భయంకరమైన హెచ్చరికలను జారీ చేస్తున్నట్లే కనిపిస్తోంది. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా ముందడుగు వేస్తూ న్యాయ వ్యవస్థతో పరాచకాలు ఆడుతున్నట్లే కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టులోనూ ఇలాంటి కేసుల్లో కీలక తీర్పులు వెలువడ్డాయి. 2021లో పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకైన 1091 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 67 లైబ్రేరియన్ పోస్టుల నియామకంలో అసమానతలు, అవకతవకలు చోటు చేసుకున్నాయని సింగిల్ జడ్జీ 2022లో రద్దు చేసింది.
సింగిల్ బెంచ్ తీర్పును 2024లో డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో 2025 జూలై నెలలో మొత్తం నియామకాలను దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేయాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాళ్లో 2016లో 25వేల ఉపాధ్యాయ పోస్టులను నియామకం చేపట్టగా ఓఎంఆర్ షీట్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ చేసి అన్ని పోస్టులను రద్దు చేసింది. వివిధ రాష్ర్టాల్లో వెగులు చూసిన ఉద్యోగ భర్తీ ప్రక్రియ రద్దు తీర్పులతో పాటుగా తాజాగా తెలంగాణ యూనివర్సిటీలో చోటు చేసుకున్న నోటిఫికేషన్ల రద్దు నిర్ణయాలు టీజీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాల వ్యవహారంలో మరోసారి పునరావృతం కావడం ఖాయమనే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.