కోటగిరి, జూలై 15: వర్షాలు కురియక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డికి కనిపించడం లేదా? అని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. సలహాదారుగా ఉండి ప్రభుత్వానికి, రేవంత్‌రెడ్డికి ఏం సలహాలు ఇస్తున్నారని నిలదీశారు. రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లను తెచ్చి నిజాంసాగర్ ప్రాజెక్టు నింపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం కోటగిరిలోని తహసీల్ ఆఫీసు ఎదుట రైతు మహాధర్నా నిర్వహించారు. కాళేశ్వరం జలాలతో నిజాంసాగర్ నీటిని నింపాలని భారీ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు నిజాంసాగర్ నీటిని విడుదల చేసి, రైతులను ఆదుకోవాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటు..
పంటలకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని బాజిరెడ్డి మండిపడ్డారు. నీళ్లు ఇవ్వాలని అడిగితే కేటీఆర్, హరీశ్‌రావును కోసి రక్తం పంటలకు చల్లితే పండుతాయని అనడం ఎంతవరకు సముచితమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. రైతులను, ప్రజాస్వామ్యాన్ని అవనమానించేలా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజల సమస్యలను పక్కన పడేసి దోచుకోవడంపైనే సీఎం, మంత్రులు దృష్టి సారించారని మండిపడ్డారు.
నీళ్లివ్వకుంటే తిరుగనివ్వరు..
నిజాంసాగర్ ఆయకట్టు కింద పంటలు ఎండిపోకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఎప్పటికప్పుడు నీళ్లిచ్చి, పంటలను కాపాడామని బాజిరెడ్డి గుర్తు చేశారు. పంటలు ఎండిపోయి, పొలాలు నెర్రెలు వారుతున్నా పట్టించుకోకుండా రైతులను రెచ్చగొట్టేలా కోటగిరిలో కాంగ్రెస్ నాయకులతో ప్రెస్‌మీట్ పెట్టిస్తావా..? అని పోచారంపై మండిపడ్డారు. నీళ్లు ఇవ్వకుంటే రైతులు గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరించారు.
కేసీఆర్ హయంలోనే సంతోషంగా ఉండే..
బీఆర్ఎస్ పాలనలో రైతులకు రెండు పంటలకు సాగునీటిని అందించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. 24 గంటల విద్యుత్, పెట్టుబడి సాయం, రైతుబీమా వంటి పథకాలు ఎన్నో అందించారని గుర్తు చేశారు. కానీ రేవంత్‌రెడ్డి వచ్చాక ఒక్క స్కీం కూడా అమలు చేయలేదని విమర్శించారు. కేవలం ఢిల్లీకి మూటలు మోయడానికే ఆయనకు టైమ్ సరిపోవడం లేదన్నారు. బాజిరెడ్డి నేతృత్వంలో నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. రైతులతో పాటు పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ‘సర్’ నియోజకవర్గ ఇన్చార్జి తోట ఆగయ్య, నేతలు అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్, యలమంచిలి శ్రీనివాస్‌రావు, వల్లెపల్లి శ్రీనివాసరావు, మాధవరెడ్డి, ధర్మతేజ, మోరె కిషన్, తెల్ల రవికుమార్, సూదం నవీన్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.