నిజామాబాద్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ నాన్గెజిటెడ్ ఆఫీసర్స్ నిజామాబాద్ జిల్లా శాఖ వ్యవహారాలపై నిఘా సంస్థలు దృష్టి సారించాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పూర్తి వివరాలను సేకరించే పనిలో పడినట్లుగా తెలిసింది. బుధవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక జిల్లా సంచికలో ప్రచురితమైన ‘సీటు వదలం… టీఎన్జీవోలో అనర్హులు…’ కథనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఉద్యోగ సంఘాన్ని అడ్డంగా పెట్టుకొని రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులెవరు? ఇందులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు? అన్న కోణంలో ఉద్యోగులంతా చర్చించుకున్నారు. ప్రభుత్వాలు మారిన వెంటనే ప్లేటు ఫిరాయించి ప్రజాప్రతినిధులను కాకాపడుతూ ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన వైనంపైనా సర్వత్రా వ్యతిరేకత ఏర్పడుతుండగా కీలకమైన నాయకుల తీరును తూర్పార పడుతున్నారు. ‘నమస్తే తెలంగాణ’ కథనంతో జీఏడీ అధికారుల్లో చలనం వచ్చింది. పలువురు సీనియర్ సిటిజన్లు, టీఎన్జీవో సభ్యులు మూకుమ్మడిగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో సాధారణ పరిపాలన శాఖలో స్పందన కనిపించింది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న నిజామాబాద్ జిల్లా టీఎన్జీవో వ్యవహారం ఇప్పుడు ఒక్కసారిగా గుప్పుమన్నట్లయ్యింది. ప్రభుత్వ ఆదేశాలతో నిఘావర్గాలు సేకరిస్తున్న సమాచారం ఇప్పుడు కీలకంగా మారనున్నది. టీఎన్జీవో నేతల అక్రమ వ్యవహారాలపై లోతుగా విచారణ చేసేందుకు సైతం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.
టీఎన్జీవోకు సంబంధించిన వ్యవహారాలను చూడాల్సిన వారంతా తమ వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేసి ఉద్యోగుల సంక్షేమాన్ని పక్కదారి పట్టించడంపై ఇప్పుడు సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. టీఎన్జీవోలో 30ఏండ్ల క్రితం సభ్యత్వం తీసుకొని నేటికీ చాలా మంది సభ్యులుగానే కొనసాగుతున్నారు. అలాంటి వారికి ఎలాంటి సంఘం పదవులు లేకపోగా కీలకమైన బాధ్యతల్లో కొందరు అర్హత లేకున్నా దశాబ్దాలుగా కొనసాగుతుండడం తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్సీ భర్తతో కాంగ్రెస్ పెద్దలను కలిసి సీటును సురక్షితంగా కాపాడుకునే యత్నాలు సైతం జరుగుతున్నాయి. తాజాగా భూ వ్యవహారాలు సైతం ఇందులో వెలుగు చూస్తున్నాయి. సంఘానికి కీలకంగా వ్యవహరించిన వారే పలు వివాదాల్లో జోక్యం చేసుకొని వాటిని చక్కబెట్టుకున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వ్యక్తులు సర్కారు భూములను కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. అందులో సర్వేఅండ్ల్యాండ్ రికార్డుకు చెందిన వారికి మరింత ఎక్కువ బాధ్యత ఉంటుంది. కానీ అదే శాఖకు చెందిన ఒకరు అసైన్డ్ భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి చేతులు మార్చినట్లుగా సమాచారం. ఎడపల్లి మండలంలో పదుల ఎకరాల్లో ఈ తతంగం జరిగిందని టీఎన్జీవో సభ్యులే ఏకరువు పెడుతున్నారు. గెజిటెడ్ అధికారిగా పదోన్నతి వచ్చినప్పటికీ స్వచ్ఛందంగా సంఘం బాధ్యతల నుంచి తప్పుకొని గౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉండగా అదేమీ చేయకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అని సాధారణ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.