కామారెడ్డి,అక్టోబర్ 14: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లో సి-విజిల్ యాప్,ఈ-సువిధ, వ్యయ నియంత్రణ, మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ పని తీరును ఎస్పీ సింధూశర్మ, అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌తో కలిసి శనివారం పరిశీలించారు.
అనంతరం నోడల్ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ఉల్లంఘనపై 1950 టోల్ ఫ్రీ నంబర్, ఎన్నికల కంట్రోల్ రూమ్ నంబర్ 8468223060, సి-విజిల్ కు వచ్చే ఫిర్యాదులపై అప్రమత్తంగా ఉంటూ వంద నిమిషాల్లో ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలు, కోడ్ ఉల్లంఘనపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి ఎన్నికల సంఘం సి-విజిల్ యాప్‌ను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఆండ్రాయిడ్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన ఫొటో ఒకటి తీసి దానిని యాప్‌లో అప్లోడ్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
ఈ యాప్ ద్వారా ఎవరైనా డబ్బు ఆశ చూపినా,ప్రలోభ పెట్టినా, మద్యం సరఫరా చేసినా, భయ భ్రాంతులకు గురి చేసినా, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రవాణా చేసినా, మతపరమైన ప్రసంగాలు చేసినా వాటికి సంబంధించిన ఫొటో లేదా వీడియో తీసి యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. సమావేశానికి ముందు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సింధూ శర్మ ..కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. సమావేశంలో నోడల్ అధికారులు కిషన్, సురేందర్ కుమార్, శాంతి కుమార్, సతీశ్ యాదవ్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.