కేంద్ర విత్త మంత్రి నిర్మలమ్మ పసుపు రైతులకు ఉత్త చేతులు చూపారు. పసుపుబోర్డుకు నిధులివ్వకుండా నిరాశ పరిచారు. శనివారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఉమ్మడి జిల్లా రైతులను మురిపించే ప్రకటనలేవీ చేయలేదు. పసుపుబోర్డుపై పదేండ్లుగా నాన్చుతూ వచ్చిన కేంద్రం.. సంక్రాంతి ముందర పసుపుబోర్డు ఏర్పాట్తు చేస్తున్నట్లు ఘనంగా ప్రకటన చేసి, ఆర్భాటంగా ప్రారంభించింది. తీరా బోర్డుకు నిధులివ్వకుండా రైతాంగం ఆశలను వమ్ము చేసింది. ఢిల్లీలో జాతీయ పసుపుబోర్డు చైర్మన్ కార్యాలయం తెరవడం, అక్కడే బాధ్యతలు స్వీకరించడం నుంచి మొదలు పెడితే కేంద్ర వార్షిక బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడంపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. పైసా కూడా కేటాయించక పోవడాన్ని బట్టి పసుపుబోర్డు అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకోవడం లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి.
-నిజామాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పసుపు బోర్డు ఉట్టిదేనా..?
రూ.50,65,345 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 75 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేసిన విత్త మంత్రి మాటల్లో ఎక్కడా నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపుబోర్డు గురించి ప్రస్తావనే రాలేదు. కనీసం పల్లెత్తు మాట కూడా వినబడలేదు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఇచ్చిన హామీ అమలుపై, కేంద్ర సర్కారు చిత్తశుద్ధిపై రైతులకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఏటా వివిధ పంటలకు కనీస మద్దతు ధరను కేంద్రమే నిర్ణయిస్తుంది. ఇప్పటివరకు పసుపు పంటకు సంబంధించి ఎమ్మెస్పీని నిర్ణయించలేదు. ఫలితంగా మార్కెట్లో పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారులు, దళారులే రాజ్యమేలుతూ రైతులను దోచుకుంటున్నారు. పసుపు రైతులకు ఊరటనిచ్చేలా ప్రోత్సాహకాలు, రాయితీలు, పసుపు సాగుకు యాంత్రీకరణకు తోడ్పాటు, సాంకేతికత దన్ను వంటివి బడ్జెట్లో ప్రస్తావిస్తారని ఆశించిన జిల్లా రైతాంగానికి నిరాశే మిగిలింది. ఎంపీ అర్వింద పైసా తేకుండా పసుపుబోర్డు అంటూ ఊదరగొట్టింది ఈమాత్రం దానికేనా? అని అన్నదాతలు ఆక్రోశం వెల్లగక్కుతున్నారు.
రైతులకు మొండిచేయి..
వార్షిక బడ్జెట్‌కు రెండు వారాల ముందే నిజామాబాద్‌లో పసుపుబోర్డును ప్రారంభించిన నేపథ్యంలో బడ్జెట్లో నిధులిస్తారని పసుపు రైతులు ఆశించారు. ఇక పసుపు బోర్డు కార్యకలాపాలు జరుగుతాయని భావించారు. కానీ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండడంతో కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. పసుపు బోర్డును శాశ్వత ప్రాతిపదికన విస్తరించాలంటే కేంద్రానికి వ్యూహాలు ఉండాలి. అందుకు తగిన విధివిధానాలు జారీ కావాల్సి ఉంది. అవేవి కనిపించడం లేదు. పైగా వ్యవసాయ క్షేత్రాల పరిశోధనకు క్షేత్రాలను రూపొందించాలి. కార్యకలాపాల నిర్వాహణకు శాశ్వత భవనాలు, రీసెర్చ్ సెంటర్లు నెలకొల్పాలి. వాటిపైనా స్పష్టత లేకపోవడంతో పసుపు బోర్డు అంశాన్ని కేంద్ర సర్కారు ఎన్నికల వేళ రాజకీయ అంశంగానే పరిగణిస్తున్నట్లు స్పష్టమవుతున్నది.
మరోవైపు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామన్న బీజేపీ నేతల ప్రకటన ఉత్తదేనని ఈ బడ్జెట్‌తో తేలిపోయింది. 2018లో రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం స్ఫూర్తితో మోదీ సర్కారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను తీసుకొచ్చింది. అర్హులైన రైతులందరికీ కేసీఆర్ ఏటా ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయమందించగా, కేంద్ర ప్రభుత్వం రూ.6వేల చొప్పున కొద్ది మందికి మాత్రమే వర్తింపజేసింది. ఈ సాయాన్ని రూ.10వేలకు పెంచుతారని బీజేపీ నేతలు ప్రకటించినప్పటికీ, బడ్జెట్లో ఎలాంటి స్పష్టత లేదు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లభించే రుణాన్ని రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచినప్పటికీ రైతులకు అంతగా ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు.
రైల్వే కేటాయింపుల్లోనూ నిర్లక్ష్యమే!
కేంద్రం ప్రభుత్వం గత సంప్రదాయానికి భిన్నంగా సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్‌ను విలీనం చేసి పార్లమెంట్లో ప్రవేశ పెడుతున్నది. ఏక కాలంలో కేటాయింపులు జరుగుతుండడంతో రైల్వేకు సంబంధించిన పూర్తి వివరాలు కులంకషంగా తెలియాలంటే మూడు, నాలుగు రోజులు పడుతుంది. జోన్ల వారీగా కేటాయింపులతో పాటుగా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో నిజామాబాద్ జంక్షన్‌కు వచ్చే కేటాయింపులు ఎంత అనేది త్వరలోనే స్పష్టత రానున్నది. మరోవైపు డబ్లింగ్పై ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో కేంద్రం ఈసారి కూడా చర్యలు తీసుకున్నట్లుగా కనిపించడం లేదు. దశాబ్దాలుగా మరుగున పడి ఉన్న ఆర్మూర్ – ఆదిలాబాద్, బీదర్ – బోధన్ రైల్వే లైన్ ప్రతిపాదనలకూ మొండి చేయి చూపినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.
నిజామాబాద్ రైతాంగాన్ని మోసం చేసిండ్రు
ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 1: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోమారు నిజామాబాద్ రైతాంగాన్ని మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం మరి దానికి బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. నిధులు లేని పసుపుబోర్డు ఎలా పని చేస్తుందని, ఏం పరిశోధనలు చేస్తుందని నిలదీశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, కాంగ్రెస్‌కు 8 మంది ఎంపీలను ఇస్తే బడ్జెట్లో సాధించిన నిధులు మాత్రం సున్నా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని ఈ బడ్జెట్‌తో మరోసారి తేటతెల్లమైనదని మండిపడ్డారు.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉన్నా.. సాధించింది సున్నా
మోర్తాడ్, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి అన్యాయం జరిగిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇది చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. కేంద్రబడ్జెట్ బీహార్ బడ్జెట్‌గా మారిందని అభివర్ణించారు. బీజేపీ నుంచి 8మంది ఎంపీలు తెలంగాణలో ఉన్నా నిధులు సాధించింది సున్నా అని విమర్శించారు. రాష్ర్టానికి నిధుల కోసం కొట్లాడాల్సిన కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా సాధించింది శూన్యమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కేంద్రాన్ని కోరుతున్నా, నవోదయ, సైనిక్ స్కూళ్లు, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ లాంటి విద్యాలయాల ప్రకటన గానీ, తెలంగాణకు ఉపయోగపడే మరే అంశం గానీ బడ్జెట్లో లేదన్నారు. ప్రాంతీయ పార్టీలకు ఎంపీలు ఉంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు.
ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్
డిచ్పల్లి, ఫిబ్రవరి 1 : బడ్జెట్లో అనుత్పాదక రంగమైన రక్షణ రంగానికి, హోం మంత్రిత్వశాఖకు ఎక్కువ నిధులు కేటాయించింది. అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతుల ఆదాయాన్ని పెంచాలి. కానీ దేశంలో 45 శాతం జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగానికి, గ్రామీణాభివృద్ధికి నిధులు తక్కువగా కేటాయించడం విడ్డూరం. బడ్జెట్లో అమలు కానీ అనేక పథకాలను చూపించి ప్రజలను మభ్యపెట్టింది.
– డాక్టర్ అక్కినపల్లి పున్నయ్య, టీయూఅర్ధశాస్త్ర విభాగాధిపతి
ప్రకటనలకే పరిమితం
ఎల్లారెడ్డి రూరల్, ఫిబ్రవరి 1: వికసిత భారత్ అంటూ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అంటూ ప్రకటనలకే పరిమితమైన బడ్జెట్ ఇది. బడ్జెట్లో కొత్తదనం ఏమీ లేదు. ప్రత్యేకంగా దివ్యాంగుల సంక్షేమానికి చేసిందేమీ లేదు. బడ్జెట్ కేటాయింపులు చూడగానే చాలా నిరుత్సాహానికి గురయ్యాం.
-ఆదిమూలం సతీశ్ , రాష్ట్ర దివ్యాంగుల సంఘం ఉపాధ్యక్షుడు, ఎల్లారెడ్డి
మద్దతు ధర రూ.15వేలు ప్రకటించాలి
పసుపు పంటకు సరైన ధర రాక నష్టపోతున్నం. ధర వస్తుందనే ఎంతో ఆశతో పసుపు వేస్తం, కానీ పంట చేతికచ్చేసరికి ఖర్చు తడిసిమోపెడైతున్నది. ధర సరిగ్గాలేక, దిగుడబడులు రాక నష్టపోతున్నం. అందుకే క్వింటాలుకు రూ.15వేల ధర ప్రకటిస్తేనే రైతులు సంతోషిస్తారు.
-గున్నాల రమేశ్, రైతు, దొన్కల్
పసుపు రైతుల ముచ్చట లేదు..
జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు కోసమని ఢిల్లీ దాకపోయినం. జిల్లాకు పసుపుబోర్డు ప్రకటించినా ఎక్కడ ఏర్పాటు చేస్తరు, రైతులు ఎక్కడికి వెళ్లాలి, మద్దతు ధర, ధరల విషయంలో తేడావస్తే ఎవరినీ అడగాలి ఇవన్నింటికీ సమాధానం ఇవ్వాలి. బడ్జెట్లో పసుపు రైతులను ఆదుకుంటారని అనుకున్నం. కానీ ఏం లేదు.
– గడ్డం చిన్నారెడ్డి, రైతు, తిమ్మాపూర్, మోర్తాడ్ మండలం
ఎక్కడ ఏర్పాటు చేస్తరు..
పసుపుబోర్డు ప్రకటించగానే రైతులు ఎంతో సంతోషించారు. కానీ పసుపుబోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయం చెప్పలేదు. రైతులకు జరిగే లాభం ఏంటి అనే దానిపై ఇప్పటికీ తెలియదు. పసుపుబోర్డు కోసం వేల్పూర్ వద్ద స్థలం ఉన్నదని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, పసుపు పరిశోధన కేంద్రం వద్ద స్థలం ఉన్నదని ఎంపీ సురేశ్‌రెడ్డి చెప్పారు.
-సంత రాజేశ్వర్, రైతు, కమ్మర్పల్లి
ఎంపీలు రాజీనామా చేయాలి..
బాన్సువాడ రూరల్, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ర్టానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు. రాష్ర్టానికి నిధుల కేటాయింపులో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ర్టానికి కేంద్రం మెండిచెయ్యి చూపడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. రాష్ర్టానికి నిధులు తేవడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు విఫలమయ్యాయి. రెండు పార్టీల ఎంపీలు రాజీనామా చేయాలి.
– మన్నె అనిల్, బాన్సువాడ