నిజామాబాద్ జూన్ 13 : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయా వర్గాలకు చెందిన మహిళలు ఉత్సాహంగా తరలివచ్చారు. బతుకమ్మ, ఇతర ఆటాపాటలతో సందడి చేశారు. వేడుకలకు స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ముఖ్య అతిథులుగా హాజరై మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా కండ్లకు కట్టినట్లు వివరించారు. వివిధ శాఖల మహిళా ఉద్యోగులను సన్మానించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు, అంగన్వాడీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు.
మహిళాభ్యుదయానికి పుట్టినిల్లు తెలంగాణ ;ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
మహిళాభ్యుదయానికి తెలంగాణ రాష్ట్రం పుట్టినిల్లని, అతివల జీవన ప్రమాణాలే అభివృద్ధికి కొలమానాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆలూర్ మండల కేంద్రంలో నిర్వహించిన మహిళా సంక్షేమ సంబురాల్లో జీవన్‌రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని పథకాలు మహిళల పేరుతోనే అమలవుతున్నాయని గుర్తుచేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి ద్వారా 8,642మంది, షాదీముబారక్ ద్వారా 1,670 మంది లబ్ధిపొందారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తల జీవితాలు దుర్భరంగా ఉండేవన్నారు. సీఎం కేసీఆర్ అడగకుండానే వేతనాలు భారీగా పెంచుతున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రధాని అయితే దేశంలోని మహిళలందరికీ పండుగే అన్నారు. మహిళల మద్దతుతో మూడోసారీ గెలిచి వారి రుణం తీర్చుకుంటానని భావోద్వేగంతో అన్నారు. ఆనంతరం పలువురు మహిళా ఉద్యోగులను సన్మానించారు. తన సతీమణితో కలిసి మహిళలకు జీవన్‌రెడ్డి పట్టుచీరలను పంపిణీ చేశారు. ఆలూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానను ప్రారంభించారు. కార్యక్రమంలో నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినితాపవన్, ఎంపీపీలు నర్సయ్య, ప్రభాకర్, వైస్ ఎంపీపీలు చిన్నారెడ్డి, సుధాకర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
మహిళా సంక్షేమంలో మనమే ఫస్ట్ ;ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
కామారెడ్డి, జూన్ 13 (నమస్తే తెలంగాణ): మహిళా సంక్షేమంలో మన రాష్ట్రమే మొదటి స్థానం లో ఉన్నదని, దేశంలో మరెక్కడా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు లేవని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డిలోని కేవీఎస్ గార్డెన్స్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆడబిడ్డల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందు కు అమలుచేయడంలేదని ప్రశ్నించారు. కామారెడ్డిలో వందపడకల మాతా శిశు దవాఖానను నిర్మించామని తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని, సర్కారు పోత్రాహంతో మహిళలు వివిధ రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని అన్నారు. అనంతరం గిరిజన సంప్రదాయ దుస్తులతో వచ్చిన మహిళలతో కలిసి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రె నృత్యం చేశారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను విప్ సన్మానించారు. మహిళలు తయారుచేసిన ఆహార పదార్థాలు, కళాకృతులను విప్ పరిశీలించి అభినందించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, పిప్పిరి వెంకటి, ప్రభాకర్, ఐసీడీఎస్ అధికారులు, మహిళలు పాల్గొన్నారు.
మహిళలకే అధిక ప్రాధాన్యం;ఎమ్మెల్యే జాజాల సురేందర్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
ఎల్లారెడ్డి, జూన్ 13 : దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం మహిళలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మహిళలకు అన్నింటా సమాన భాగస్వామ్యం ఉండాలని భావించిన ప్రభుత్వం.. 33 శాతం రిజర్వేషన్ కల్పించిందని కలెక్టర్ వివరించారు. కామారెడ్డి జిల్లాలోని ఎర్రాపహాడ్, డోంగ్లి, బీర్కూర్‌లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. న్యూట్రిషన్ కిట్ పంపిణీతో తల్లు ఆరోగ్యంలో చాలా మార్పు వచ్చిందన్నారు. ఎమ్మెల్యే జాజాల మాట్లాడుతూ.. లింగంపేట, సదాశివనగర్ మండలాల్లో మహిళలు వ్యాపారంలో ప్రగతి సాధించారని తెలిపారు. మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, ప్రోత్సాహకాలను గుర్తుచేశారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ కాశీ నారాయణ, ఎంపీపీ మాధవి తదితరులు పాల్గొన్నారు.
మహిళల సేవలు వెలకట్టలేనివి; ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
డిచ్పల్లి, జూన్ 13: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా డిచ్పల్లి మండలం కేఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించిన మహిళా ఉద్యోగుల సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆశ వర్కర్లకు శ్రద్ధాంజలి ఘటించారు. గతంలో ఆడశిశువు జన్మిస్తే అమ్మో ఆడబిడ్డా! అని ఆందోళన చెందేవారని, కానీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని తెలిపారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది కేవలం బీఆర్ఎస్ సర్కారేనని అన్నారు. తొమ్మిదేండ్లలో మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలను గుర్తుచేశారు. అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లకు ఊహించని విధంగా గౌరవ వేతనం అందజేస్తున్నదని తెలిపారు. అంగన్వాడీ సిబ్బందికి మూడుసార్లు వేతనాలు పెంచిందన్నారు. తాజాగా పీఆర్పీ వర్తింపజేయడంతో టీచర్లకు రూ.13,650, ఆయాలకు రూ.7,800 వేతనాలు అందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఆర్డీవో రవి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ బానావత్ మంజుల, ఎంపీపీలు రమేశ్ నాయక్, నల్ల సారికారెడ్డి, విమలారాజు, అనూషా ప్రేమ్, లతా కన్నేరామ్, జడ్పీటీసీలు ఇందిరా లక్ష్మీనర్సయ్య, గుజ్జ రాజేశ్వరి, సీడీపీవో స్వర్ణలత, డిచ్పల్లి, ఇందల్వాయి బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాళ్లు గీత, వసంత, ఎంపీడీవో గోపీబాబు, ఎంపీవో శ్రీనివాస్‌గౌడ్ నాయకులు, అంగన్వాడీ, వైద్యారోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
అత్యధిక రిజర్వేషన్లు తెలంగాణలోనే;ఎమ్మెల్యే షిండే, కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ శోభ
పెద్దకొడప్గల్, జున్ 13: మహిళలకు అత్యధిక రిజర్వేషన్లు మన రాష్ట్రంలోనే కల్పిస్తున్నట్లు జుక్కల్ ఎమ్మెల్యే షిండే, కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభా రాజు అన్నారు. మండలకేంద్రంలో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మహిళల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో పౌష్టికాహారాన్ని పరిశీలించారు. గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. వివిధ శాఖల మహిళా ఉద్యోగులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో రమేశ్‌బాబు, మిషన్ భగీరథ సీఈవో రాంచందర్ నాయక్, ఐసీడీఎస్ సీడీపీవో సునంద, ఎంపీడీవో రాణి, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది మహిళా సంక్షేమ ప్రభుత్వం;అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా
ఖలీల్‌వాడి, జూన్ 13 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మహిళా సంక్షేమ ప్రభుత్వం కొనసాగుతున్నదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెలేయ బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నగరంలోని శ్రీరామగార్డెన్లో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమం, భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ హామీ మేరకు ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తున్నామన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేదుకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి వీ హబ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. షీ టీమ్స్‌తో మహిళలకు భద్రత కల్పించామని, డ్రైవింగ్‌లో శిక్షణ అందించి సబ్సిడీపై వాహనాలు అందిస్తున్నామన్నారు. చిన్నారులు, బాలికలు, గర్భిణులు, బాలింతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆడబిడ్డలపై వివక్ష చూపొద్దని, లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళాభ్యుదయానికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మనందరం మద్దతుగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు లత, సవిత, ఉమారాణి, యమున, నర్సుబాయి, నవనీత, బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గంగామణి, మెప్మా, ఐసీడీఎస్, వైద్యరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.