కామారెడ్డి,సెప్టెంబర్ 8 : నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొలువుల జాతర కొనసాగుతున్నది. ఇప్పటికే వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర విద్యా శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలనే ప్రధాన లక్ష్యంతో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.
కామారెడ్డి జిల్లాలో 200పోస్టులు
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అదనపు కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, జిల్లా విద్యాశాఖాధికారి సెక్రటరీగా, జడ్పీ సీఈవో మెంబర్‌గా ఉంటాడు. 2017లో నిర్వహించిన టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్‌కు సంబంధించి రోస్టర్ పద్ధతిలో ఎంపికై మెరిట్ జాబితా ఆధారంగా పోస్టులను భర్తీచేశారు. కామారెడ్డి జిల్లాలో 317 జీవో ప్రకారం సొంత జిల్లాలకు టీచర్లను బదిలీ చేయడం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించాలంటే జిల్లాలో 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు 97, సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) 86, లాంగ్వేజ్ పండిట్స్ 12, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 5 పోస్టులను భర్తీ చేయనున్నారు.
టీఆర్ట్టీ షెడ్యూల్ ఇలా..
టీఆర్టీ నిర్వహణ ప్రక్రియలో మరో కీలక అడుగుపడింది. ఈ నెల 20నుంచి అక్టోబర్ 21 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ https://schooledu. telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు. ఫీజును చెల్లించి తమ దరఖాస్తును దాఖలు చేసే ముందు వెబ్సైట్లో లభ్యమయ్యే, ఉచితంగా డౌన్లోడ్ చేసుకోగలిగే సమాచార బులిటెన్‌ను పూర్తిగా చదివి అవసరమైన అర్హతలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో ఉద్యోగానికి దరఖాస్తు ఫీజు రూ.1000గా నిర్ణయించారు. ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాల్సిన అభ్యర్థులు వేర్వేరుగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ గేట్‌వే లింక్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, యూజర్ గైడ్లు ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. రాత పరీక్ష నవంబర్ 20 నుంచి 30 తేదీ మధ్యలో ఉంటుంది.
ఈ నెల 20 నుంచి దరఖాస్తులు
టీఆర్టీ కోసం అభ్యర్థులు ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే టెట్ అర్హత సాధించిన వారు ఉద్యోగం కోసం కష్టపడి చదవాలి. ఇతర వివరాలు ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.
-రాజు, డీఈవో, కామారెడ్డి