నిజామాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ వెలువరించింది. నవంబర్ 3వ తేదీన ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. పదో తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 13న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు 15వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు సీఈసీ వెల్లడించింది. షెడ్యూల్ వెలువరించడంతో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 20.26 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మరోవైపు, అభ్యర్థులను గతంలోనే ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్నది. ఎమ్మెల్యేలంతా ఇప్పటికే నియోజకవర్గాలను చుట్టేశారు. ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు. అభివృద్ధికి మద్దతుగా బీఆర్ఎస్కే ఓట్లేస్తామంటూ అనేక కులసంఘాలు స్వచ్ఛందంగా తీర్మానాలు చేస్తున్నాయి. మరోవైపు, ప్రతిపక్ష పార్టీల్లో సీట్ల పంచాయితీ ఇంకా తెగలేదు. దీంతో అయోమయంలో ఉన్న ఆయా పార్టీల కేడర్ గులాబీ గూటికి చేరుతున్నది.
అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. విడుదలైన షెడ్యూల్ ప్రకారం తక్షణం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. నవంబర్ 3 నుంచి మొదలయ్యే ఎన్నికల నామినేషన్ల ప్రక్రియతో హడావుడి మొదలవుతుంది. అనంతరం నామినేషన్ల స్వీకరణ నవంబర్ 10వరకు కొనసాగుతుంది. నవంబర్ 30న ఓటింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న ఎన్నికల కౌటింగ్, ఫలితాల ప్రకటన ఉండబోతోంది. డిసెంబర్ 5తో మొత్తం ప్రక్రియ ముగిసినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో నెలన్నర రోజుల క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఏకంగా 119 స్థానాలకు 115 స్థానాల్లో ఎవరు పోటీ చేసేది తేలడంతో ఎన్నికల సమరంలో అంతా సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండడంతో ఉమ్మడి జిల్లాలో ప్రాధాన్యతను సంతరించుకున్నది.
బీఆర్ఎస్ జోరు..
ఎన్నికల సమరానికి ముందు నుంచే బీఆర్ఎస్ జోరుగా ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఓ వైపు సీఎం కేసీఆర్ కార్యక్రమాలతోపాటు అభివృద్ధి పనులు, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రచార కార్యక్రమాలతో శ్రేణుల్లో కొంగొత్త జోష్ కనిపిస్తున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జోరుగా ప్రచారాలు నిర్వహించడంతోపాటు ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. అధినేత కేసీఆర్ ఆదేశాలతో ప్రజల్లోనే ఉంటూ నిత్యం తమ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఉమ్మడి జిల్లాలో అభ్యర్థులే కరువయ్యారు. ఎవరికీ ఇప్పటి వరకు పోటీలో నిలిచేదెవరన్నదీ తేలలేదు. ఎవరికి బీఫాం వస్తుందో కూడా అంతు చిక్కడం లేదు. అధికార బీఆర్ఎస్ పార్టీలో మాత్రం అభ్యర్థుల ఖరారు ముందే జరగడంతో ప్రచారం ఇప్పటికే మొదలైంది. చాలా మంది ఎమ్మెల్యేలు ఒక దఫా ప్రజల్లో తిరిగేశారు. ప్రజల మద్దతును, వారి ఆశీర్వాదాన్ని ఇప్పటికే దక్కించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు, ప్రభుత్వాన్ని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు సర్వ శక్తులను ధారపోస్తున్నారు.
మహిళా ఓటర్లే అత్యధికం…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 9 నియోజకవర్గాలుంటే అన్నింట్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా ఓటర్లున్న నియోజకవర్గంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నిలిచింది. ఇక్కడ 2లక్షల 86వేల 836 మంది ఓటర్లున్నారు. నిజామాబాద్ రూరల్‌లో 2లక్షల 48వేల 451 మంది ఉన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోనూ 2లక్షల 45వేల 982 మంది ఓటర్లున్నారు. ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్యలోనూ నిజామాబాద్ అర్బన్‌లో 32మంది, కామారెడ్డిలో 24మంది ఉన్నట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. సర్వీస్ ఓటర్ల వివరాలకొస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 258మంది ఉన్నారు. ఆ తర్వాత నిజామాబాద్ రూరల్‌లో 182 మంది ఉన్నారు. మొత్తానికి ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను మహిళా ఓటర్లే డిసైడ్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అబలలే ఓటర్ల సంఖ్యలో పైచేయి సాధించడంతో ఎవరు మన పాలకున్నది తేల్చే నిర్ణయాధికారాన్ని మహిళా ఓటర్లే నిర్ణయించబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్
నిజామాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 9న నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు అధికారికంగా వివరాలను వెల్లడించాయి. నవంబర్ 3నుంచి నవంబర్ 10వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉండడంతో వచ్చే నెల 9న నామినేషన్ వేయబోతున్నారు. గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ వేసిన అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. సభను మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించనున్నారు. నామినేషన్లకు ముందు సీఎం కేసీఆర్ తమ కుటుంబ ఆరాధ్య దైవమైన సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు చేస్తారు. అక్టోబర్ 15న ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశమవుతారు. అదేరోజు అభ్యర్థులుగా ప్రకటించిన వారందరికీ బీ ఫాంలు అందజేసి, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను వెల్లడించనున్నారు.
అందరి చూపు మేనిఫెస్టో పైనే..
భారత రాష్ట్ర సమితి మేనిఫెస్టోపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ప్రతిపక్షాల దిమ్మతిరిగే విధంగా మేనిఫెస్టో ఉంటుందని ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ప్రకటించిన నేపథ్యంలో సామాన్య ప్రజలకు మేలు చేకూర్చేలా కేసీఆర్ హామీలను అందించబోతున్నారని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆచరణలోకి తీసుకువచ్చారు. చాలా వరకు పథకాలను హామీ ఇవ్వకుండానే అమలు చేశారు. విజయవంతంగా ప్రజలకు ఉపయోగపడే పథకాలను అమల్లోకి తీసుకువచ్చి వారి మేలును కోరుకుంటున్న కేసీఆర్… ఈసారి కూడా అదే స్థాయిలో ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలనే వెల్లడిస్తారనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడింది. అక్టోబర్ 15న జరిగే ఎమ్మెల్యేల సమావేశంలోనే మేనిఫెస్టో ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించడంతో ప్రజల్లో చర్చ మొదలైంది. ఇప్పటి వరకు అమలవుతున్న సంక్షేమ పథకాలతోపాటు అదనంగా వచ్చే వరాలు ఏ విధంగా ఉంటాయో అన్న ఆసక్తి
నెలకొన్నది.