నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లాలో గురువారం ప్రారంభించారు. జనవరి 6వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం.. గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఇందులో భాగంగా మొదటి రోజైన గురువారం 112 గ్రామపంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని 146 మున్సిపల్ వార్డులో ప్రజాపాలన సభలు కొనసాగాయి. అధికారులు తమ సిబ్బందితో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. వివరాలను రిజిస్టర్లలో నమోదు చేస్తూ దరఖాస్తుదారులకు రసీదులను అందజేశారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మీ, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు సంబంధించి ప్రజలు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిట్లోకి తెస్తూ వారి సమస్యలను పరిష్కరించేందుకు, ఆరు గ్యారెంటీల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎమ్మెల్యేలు తెలిపారు.
ఖలీల్‌వాడి, డిసెంబర్ 28 : జిల్లా కేంద్రంలోని 8వ డివిజన్లోని నలంద పాఠశాలలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమం రెండు గంటల్లోనే ముగిసింది. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ దండు నీతూ కిరణ్ హాజరయ్యారు. మధ్యాహ్నం 12.20 గంటలకు అధికారులు కార్యక్రమాన్ని ముగించారు. కాలనీవాసులు దరఖాస్తులు అందజేసేందుకు వచ్చి పాఠశాల సిబ్బందిని అడగగా.. లంచ్‌కి వెళ్లారని, 3.30 గంటలకు వస్తారని సమాధానం చెప్పారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి రోజే ఇలా నిర్వహిస్తే ఎలా అని అసంతృప్తి వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులు ఉన్నవారికి మాత్రమే ఆరు గ్యారెంటీలు వర్తిస్తాయని ప్రభుత్వం చెబుతున్నదని, రేషన్‌కార్డులు లేని వారి పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆన్లైన్లో కాకుండా, మ్యానువల్‌గా దరఖాస్తులు తీసుకోవడం ద్వారా సమయం వృథా అవుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారులు రేషన్‌కార్డుల దరఖాస్తుల విషయంలో ప్రజలకు ఏమీ చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.