Nizamabad | కంటేశ్వర్, జూన్ 8 : అటవీ భూములను కబ్జాల నుండి రక్షించాలని కోరుతూ సిరికొండ మండలం రావట్ల గ్రామస్తులు కలెక్టరేట్‌కు సోమవారం తరలివచ్చి ఆందోళన చేపట్టారు. నూతన కలెక్టరేట్ కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. అటవీ భూమి కబ్జాల విషయంలో అధికారులు పట్టించుకోవట్లేదని కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేంతవరకు కదిలేది లేదని భీష్ముంచుకు కూర్చున్నారు. స్థానిక పోలీసులు ఏసీపీ, అదరపు కలెక్టర్ కిరణ్ కుమార్ వచ్చి సముదాయించినా మాట వినని గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట దాదాపు మూడు గంటల పాటు కూర్చోవడంతో హైడ్రామా కొనసాగింది. మొదటగా ఏసీపీ ప్రకాష్ గ్రామస్తుల వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చినా గ్రామస్తులు వినలేదు. అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నేరుగా వచ్చి గ్రామస్తుల సమస్యలు విని సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయినా కలెక్టర్ వచ్చేంతవరకు కదిలేది లేదని బైఠాయించి కూర్చున్నారు.
దాదాపు నిరసన రెండు గంటల తర్వాత డీఎఫ్‌వో సిద్ధార్థ వచ్చి అడవుల ఆక్రమణను అడ్డుకుంటానని గ్రామస్తులకు హామీ హామీ ఇచ్చారు. డీఎఫ్‌వో హామీతో గ్రామస్తులు ధర్నా విరమించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అటవీ భూమిని కొందరు కబ్జాదారులు అన్యాక్రాంతం చేస్తున్నారని పలుమార్లు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అటవీ శాఖ అధికారుల అండదండలతోనే కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు అటవీశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
అడవులను కాపాడాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారుల దేనని ఇప్పటికైనా కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోతే మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది పైగా గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.