ఇందూరు, ఫిబ్రవరి 8: నిజామాబాద్ జిల్లాలో రథ సప్తమి వేడుకలను మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంలోని నీల కంఠేశ్వరాలయంలో ఉదయం నుంచే భక్తులు బారులు తీరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. భక్తుల కోలాటాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో జాతర ఏర్పాటు చేయగా పలు దుకాణాలు వెలిశాయి. దీంతో కంఠేశ్వర్, పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతం సందడిగా మారింది. రథ సప్తమి సందర్భంగా ఆలయంలో ఉదయం కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఏసీపీ వెంకటేశ్వర్లు, నగర మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు పూజలు నిర్వహిం చారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు రుద్రాభిషేకం, అనంతరం స్వామి వారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. రథోత్సవం, జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ బిల్ల మహేశ్ తెలిపారు.
మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో మంగళవారం రథ సప్తమి సందర్భంగా రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ధర్మకర్త, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రథాన్ని స్వయంగా నడిపారు. స్వామివారిని సూర్య ప్రభ వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కమ్మ సత్యనారాయణ స్వామివారికి బంగారు ఆభరణాల కోసం 5 గ్రాముల బంగారాన్ని బహూకరించారు. బీర్కూర్ మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన భరత్‌కుమార్ ఆలయంలో శాశ్వత అన్నదాతగా రూ.25 వేలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు నందకిశోర్, కమిటీ సభ్యులు ద్రోణవల్లి సతీశ్, కొరిపెల్లి రాంబాబు, ద్రోణవల్లి అశోక్, ఢీకొండ మురళి, నర్సరాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.