Rampur farmers | ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సొసైటీ పరిధిలోని రాంపూర్ గ్రామంలో నెలరోజులుగా ధాన్యం కోసి కల్లాల్లో వేసి తూకం చేసిన కూడా లారీల కొరతతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాంపూర్ గ్రామస్తులు ఆర్మూర్ సొసైటీకి సోమవారం తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. సొసైటీ నిర్వాహకులు లారీ యజమానులతో కుమ్మక్కై లారీలను తమ గ్రామానికి పంపడం లేదని, మిగతా గ్రామాలకు ప్రతీరోజు ఒకటి, రెండు లారీలను పంపుతూ ధాన్యం సేకరిస్తున్నారని, తమ గ్రామం పై వివక్ష ఎందుకు చూపిస్తున్నారని సొసైటీ చైర్మన్ ని నిలదీశారు.
ధాన్యం రోజుల తరబడి కల్లాల్లో ఉండడం వల్ల తరుగు రూపంలో క్వింటానికి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలను పంపి కొరతను తీరుస్తానని నిర్వాహకులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించి రెండు రోజులలో లారీలను తీసుకొని రాకుంటే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్రామస్తులము అందరం కలిసి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.