తెలంగాణ దేహానికి వేల ఊర్లు, లక్షల పేర్లు ఉండొచ్చు.లోకాన్నే అక్కున చేర్చుకునే అమ్మలా.. అణగదొక్కితే ఎదురుతిరిగే కాళికలా తన చరిత్ర సాగవచ్చు. పల్లె చెట్ల కింద తృప్తిగా కబుర్లాడుకునే బాపులా, పట్నంలో సందడి చేసే పోరనిలా తన పాత్ర మారొచ్చు. కానీ, తన ఆత్మ మాత్రం ప్రకృతికి దగ్గరగానే ఉంటుంది. అందుకే వజ్రాల్లో మునిగితేలిన రోజున అహంకరించలేదు, రజాకర్లకి రక్తమోడిన రోజున తలవంచలేదు. తనదైన అస్తిత్వంతో కలబడింది. లేచి నిలబడింది. తెలంగాణ అస్తిత్వం నేల తల్లికి ఎంత దగ్గరగా ఉంటుందో గుర్తుచేసుకోవాలంటే ఇక్కడి సంప్రదాయాలు తలుచుకుంటే చాలు. ఇక్కడి బతుకమ్మ, బోనాలు, మేడారం జాతర.. అన్నీ కూడా మనిషికీ మట్టికీ మధ్య ఉన్న బంధాన్ని నిరూపించేవే. బతుకమ్మ… బతుకునే దైవంగా భావిస్తే, బోనాలు ఆ బతుకును నడిపించే శక్తిని వేర్వేరు స్వరూపాలలో గుర్తించి కొలిచే సందర్భం. ఇక సాటి ప్రజల కోసం తపించే మనిషి దైవంగా మారగలడని నిరూపించేది సమ్మక్క, సారలమ్మ కథనం. వీటికంటే గొప్ప భావనలు, క్రతువులు ఇంకేం ఉంటాయి. అందుకే ఈ ఆషాఢ మాసంలో మరోసారి మన ఆడబిడ్డల శిరసున.. అంతెత్తున శక్తి కిరీటంలా భాసించే బోనాలను తల్చుకుందాం.

ఈరోజున మనకి ప్లేగు వ్యాధి అంటే భయం లేదు. ఈతరం చాలామంది ఆ మాటను వినే ఉండకపోవచ్చు. కానీ ఓ వందేళ్ల క్రితం వరకూ ఆ మాట వింటేనే లోకం ఉలిక్కిపడేది. దగ్గరలో ప్లేగు ఉందని తెలిస్తే ఊళ్లకు ఊళ్లు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరో దిక్కుకి పారిపోయేవి. ఎర్సీనియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఏర్పడే ఈ మహమ్మారి ఎంత ప్రాణాంతకమైంది అంటే… ఓ ఆరువేల ఏళ్ల క్రితం అది దాదాపుగా మానవజాతి మొత్తాన్నీ తుడిచిపెట్టేసింది. ఆ తర్వాత కూడా నాగరికత నిలదొక్కుకున్న ప్రతిసారీ విరుచుకుపడుతూనే వచ్చింది. రోమన్ సామ్రాజ్యాన్నీ వదల్లేదు, యూరప్ వేగానికీ తలొగ్గలేదు. 14వ శతాబ్దంలో బ్లాక్ డెత్ పేరుతో ఐరోపా మీద విరుచుకుపడిన ప్లేగు అక్కడి 50 శాతం ప్రజల్ని పొట్టన పెట్టుకుంది. అలాంటి మహమ్మారి హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించిన సమయంలోనే బోనాల ఆచారం మరోసారి వెలుగులోకి వచ్చింది.
1813లో హైదరాబాద్ రాష్ట్రం ప్లేగుతో తల్లడిల్లింది. అప్పట్లో చికిత్సే లేని ఆ వ్యాధి సోకిందంటే దాదాపుగా చావు ఖాయమైనట్టే. అదే సమయంలో హైదరాబాద్ బెటాలియన్‌కు చెందిన కొందరు సైనికులు ఉజ్జయినిలో ఉన్నారు. ఇంటి నుంచి వస్తున్న వార్తలతో వారు భయపడిపోతున్నారు. ఒక రోజు తండ్రి, ఒక రోజు తనయుడూ కుప్పకూలుతుంటే వాళ్ల గుండెలు అవిసిపోసాగాయి. మరో దిక్కు తోచలేదు. మృత్యువును శాసించే ఆ ఉజ్జయిని మహాకాలేశ్వరుని, ఆ శివుడినే నడిపించే ఉజ్జయిని మహంకాళిని వేడుకున్నారు. ప్లేగు వ్యాధి కనుక ఆగిపోతే ఆ మహంకాళి అంశతో హైదరాబాదులో ఓ అమ్మవారి గుడిని నిర్మిస్తామని బాస చేశారు. ఆశ్చర్యంగా వారు తిరిగి హైదరాబాద్‌కి చేరుకునే సమయానికి ప్లేగు సమసిపోయింది. అమ్మకు మొక్కుకున్నట్టుగానే 1814 సంవత్సరం ఆషాఢ మాసంలో మహంకాళి ఆలయాన్ని నిర్మించారు. బోనాలూ సమర్పించారు. అప్పటి నుంచి ప్రతి ఆషాఢ మాసంలోనూ అమ్మవారికి బోనాలు నడుస్తూనే ఉన్నాయి.
ఇదే మొదలు కాదు. బోనాల ఆచారాన్ని నిరాటంకంగా నడిపించడం మహంకాళి అమ్మవారితో మొదలైందే కానీ.. సంప్రదాయం మాత్రం అంతకు వందల ఏళ్ల ముందు నుంచే ఉందని చరిత్రకారులు నిరూపించారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న గొబ్బూరు అనే చోట దొరికిన ఓ అరుదైన శాసనమే ఇందుకు సాక్ష్యం. తెలుగు భాషలో ఉన్న ఈ 1516 సంవత్సరం నాటి శాసనంలో శ్రీకృష్ణదేవరాయలు బోనాలకు మద్దుతగా ఇచ్చిన పన్ను మినహాయింపుల ప్రస్తావన ఉంది. అంటే రాయలు మెచ్చిన ఆచారమన్నమాటే! తెలంగాణ యోధుడు సర్వాయి పాపన్న హుస్నాబాదులో ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని కట్టించి బోనాలు సమర్పించినట్టు కైఫియతులలో ఉంది. తానీషా కాలంలోనూ బోనాలు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ చారిత్రకంగా చెప్పుకోదగిన ఆధారాలే. అంతకు ఎన్ని వందల ఏళ్ల నుంచీ బోనాల ఆచారం ఉందో కాలానికే ఎరుక.

Bunalu
శక్తులకి శరణు
ఇంటికి ఓ పెద్ద ఉంటే, ఏ సమస్య అయినా తను తీరుస్తాడని నమ్మకం ఉంటుంది. తను దూరదేశం వెళ్లినా, పనిలో ఉన్నా… తమకంటూ ఓ అండ ఉందనే రక్ష ఉంటుంది. అలాంటిది గ్రామాన్నే కాపాడే ఓ అతీతశక్తి ఉందనీ, అందరినీ తన చల్లని చూపుతో గమనించుకుంటుందనీ, కోపం వచ్చినా శాంతించే పెద్దమనసుందనీ నమ్ముకోవడం సహజమే. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, పెద్దమ్మ, నూకాలమ్మ.. ఇలా ప్రతి గ్రామానికీ కాదు పట్నంలో వాడలకు కూడా ఇలవేల్పులు ఉన్నారు. అమ్మగా భావించి వీరికి ‘భోజనం’ పెట్టడమే బోనం. బతుకమ్మలాగే ఈ బోనాలు కూడా మహిళల పండుగే!
బోనం కుండ
పంటల నుంచీ ఆరోగ్యం వరకు గతం అంతా సవ్యంగా సాగిందనే మొక్కుగా, ముందుముందూ ఇలాగే చల్లగా చూడాలనే కోరికగా బోనాలు సమర్పిస్తారు. కొత్తకుండలో బెల్లమన్నం వండటం ఎక్కువ చోట్ల కనిపిస్తుంది. ప్రాంతాలను బట్టి ఆ అన్నానికి పెసరపప్పు, పాలు, పెరుగు, పసుపు, కొబ్బరి… లాంటి పదార్థాలూ జోడిస్తారు. ఇప్పుడు వంట మాత్రమే పూర్తయింది. కానీ, ఆ పాత్రను పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి.. దాని మీద ఓ దీపం (బోనం జ్యోతి) ఉంచినప్పుడే బోనం అవుతుంది. దీపాన్ని కొలువుదీర్చడం బోనానికి పవిత్రత కోసం మాత్రమే కాదు, చీకట్లో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు దారిదీపంగా కూడా ఉపయోగపడుతుంది.
తలస్నానం చేసి, నిండైన అలంకరణతో చుట్టుపక్కల ఆడపడుచులతో ఆ బోనాన్ని తలకెత్తుకుని ఊరేగింపుగా గ్రామదేవత కొలువుకు వెళ్లి బోనాన్ని నివేదిస్తారు. బోనం తీసుకునే గ్రామదేవతే కాదు, దాన్ని సమర్పించే ఆడపడుచులోనూ అమ్మవారి అంశను చూసుకోవడం మరో ప్రత్యేకత. ఆ నమ్మకంతోనే బోనం తీసుకువెళ్లేవారిలో ఉగ్రతత్వాన్ని చల్లబరిచేందుకో, గౌరవంగానో వారి కాళ్ల మీద నీరు పోస్తారు. ఇలా ఒకచోటకు చేర్చిన బోనాలన్నింటినీ ఓ బండిలో ఉంచి, దాన్ని ఊరేగిస్తారు. అది కూడా ఓ ఉత్సవమే… ఫలహారబండి ఉత్సవం. బోనం కార్యక్రమాలు పూర్తయ్యాక.. దాన్ని నైవేద్యంగా భావించి కుటుంబసభ్యులకి, భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. మిగిలింది పారేయడానికి ఎవరూ ఇష్టపడరు. బీదసాదలకీ, పశువులకీ పంచడానికి ప్రాధాన్యమిస్తారు.

అడుగడునా ఆరాధన
బోనం అంటే కేవలం నైవేద్యం సమర్పించడం మాత్రమే కాదు. బోనాలు ప్రారంభం అయిన రోజు దగ్గర్నుంచీ అడుగడుగునా ఎన్నో సంప్రదాయాలు కనిపిస్తాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ సందడి ఉంటుంది.
ఘటోత్సవం: తొలి రోజు పూజారులు ప్రత్యేకంగా తయారుచేసిన కలశాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు. అమ్మవారి స్వరూపంగా భావించే ఈ ఘటాన్ని ప్రతిష్ఠించిన తర్వాతే ఆయా ప్రాంతాల్లో బోనాలు మొదలవుతాయి. ఈ ఘటాల ఊరేగింపులో పోతురాజుల నృత్యాలు, డప్పుల సందడితో పండుగ ఊపు వచ్చేస్తుంది.
తొట్టెలు: బోనాల్లో మరో సందడైన సంప్రదాయం తొట్టెల ఊరేగింపు. కాగితం లేదా వెదురుతో ఊయల/ఇంటిలాంటి ఆకృతి తయారుచేయడమే తొట్టె. ఇలా చేసిన తొట్టెలు అమ్మవారికి సమర్పిస్తే సొంతింటి కల నెరవేరుతుందనీ, ఉన్న ఇల్లు సుభిక్షంగా ఉంటుందనీ నమ్మకం. వీటిలో లంగర్ హౌజ్ నుంచి గోల్కొండ కోట వరకు సాగే తొట్టెల ఊరేగింపు చూసి తీరాల్సిందే!
సాక: బోనం ఆలయం చేరుకున్న ఆడపడుచులు అమ్మవారికి బెల్లపు పానకం పోస్తారు. దీన్ని సాక పోయడం అంటారు. అందరూ తెచ్చిన సాకను ఓ చోట పోసే ‘వడి’ అనే వేడుకా ఉంటుంది. కొన్ని చోట్ల అమ్మకు కల్లు పోయడమూ ఉంటుంది. అదే కల్లుసాక.
రంగం: పచ్చికుండను భూమిలో పాతి, దాని చుట్టూ బియ్యంతో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. అక్కడికే వచ్చే ‘మాతంగి’ చెప్పే భవిష్యవాణిని యావత్ తెలంగాణ ఆసక్తిగా వింటుంది. రాజకీయం, వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధుల గురించి చెప్పే మాటల మీద గొప్ప నమ్మకం ఉంటుంది.
బలి: శక్తి ఆరాధనలో బలి కూడా భాగమే. బోనాల సమయంలోనూ దున్నపోతుల నుంచి కోళ్ల వరకూ బలి ఇచ్చేవారు. వీటిలో కొన్ని పోతురాజుల చేతుల మీదుగానే జరిగేవి. బలి మీద ఉన్న నిషేధాల తర్వాత గుమ్మడికాయ, సొరకాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ లాంటివాటికి కుంకుమ అద్ది జంతుబలికి ప్రతీకగా దైవానికి సమర్పిస్తున్నారు.
సాగనంపటం: బోనాలు పూర్తయిన తర్వాత అమ్మవారిని ఊరేగిస్తారు. కొన్నిచోట్ల గజారోహణంతో ఘనంగా సాగే ఈ వేడుక ఘటం నిమజ్జనంతో పూర్తవుతుంది. ప్రకృతి స్వరూపమైన అమ్మవారిని ఆవాహన చేసుకుని, పూజించి తిరిగి అదే పంచభూతాలలో కలిపే ప్రయత్నమిది.

Bunalu
నజర్ బోనంతో మొదలై
గోల్కొండ ఖిల్లాకి వెళ్లే దారిలో ఉన్న జగదాంబికా ఎల్లమ్మకు బోనాలు ఇవ్వడంతో ఈ వేడుక మొదలవుతుంది. హైదరాబాద్‌లోనే అతి పురాతన గుడిగా తొలి బోనానికి ఈ ఆలయం అర్హమైందే. కాకతీయుల, కుతుబ్ షాహీల కాలంలో వీరుల పూజలందుకున్న ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉందని చెబుతారు. చాళుక్యుల కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారిని కొందరి అంచనా. అలాంటి అమ్మకు తొలిబోనం ఇవ్వడం ఆచారంగా వస్తున్నది. అది కూడా సాధారణంగా ఉండదు. ఊరూవాడా ప్రాణప్రదంగా భావించే బోనాల వేడుకకు ఎలాంటి దిష్టీ తగలకుండా ఉండేందుకు నజర్ బోనం తీస్తారు. తానీషా సూచనతో సాక్షాత్తు అక్కన్న మాదన్నలే ఈ నజర్ బోనాన్ని ఆరంభించినట్టు చెబుతారు. గోల్కొండకు చెందిన పటేలమ్మతో ఈ బోనం వండిస్తారు కాబట్టి దీన్ని పటేలమ్మ బోనం అని కూడా అంటారు. ఇక్కడ మరో విశేషముంది. తొలి బోనంతోనో, ఒక్క ఆదివారంతోనో ఇక్కడి వేడుక ముగిసిపోదు. నెల రోజుల పాటు ఈ అమ్మవారికి బోనాలు అర్పిస్తారు. ప్రతి ఆదివారం, గురువారాల్లో బోనమెత్తుతూ మొత్తం తొమ్మిది బోనాలు ఇస్తారు.
రెండోవారం బల్కంపేట మీదుగా..
ఆషాఢ మాసం రెండో ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఇంకా బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల్లో బోనాలెత్తుతారు. మహంకాళి అమ్మవారి గురించి ముందే చెప్పుకొన్నాం. బల్కంపేట ఎల్లమ్మ ఆలయానిదీ అసాధారణమైన చరిత్రే! దాదాపు ఏడువందల ఏళ్ల క్రితం సంగతి. అప్పటికి బల్కంపేట ఓ చిన్న ఊరు. పొలాలు, వాటి మీద ఆధారపడిన రైతులదే అక్కడి జీవనం. అలాంటి ఓ రైతు తన పొలంలో బావి తవ్వుతుంటే ఏదో అడ్డుపడినట్టు తోచింది. తొలిచి చూస్తే అది రాయి కాదు… అమ్మవారి విగ్రహం అని తేలింది. ఆ విగ్రహాన్ని పెకళించి నీడన పెడదామనుకున్నాడు. తన వల్ల కాలేదు. సాయానికి పిలిచినవారి వల్లా కాలేదు. చూసేందుకు వచ్చిన ఊరివల్లా కాలేదు. చివరికి అక్కడికి వచ్చిన శివసత్తులు… ఆ తల్లిని రేణుకాంబగా గుర్తించారు.
ఊటలో ఉండి పూజలందుకోవడమే అమ్మవారి అభీష్టమని సూచించారు. అప్పటినుంచి తెలంగాణవాసులకు ఆదిపరాశక్తిగా, అండగా నిలబడుతున్నదీ ఎల్లమ్మ. తన శిరసు నుంచి ఉబికే జలంతో సర్వరోగాలు నయమవుతాయని, దుష్టశక్తులు దూరమవుతాయని నమ్ముతారు. ప్రతి ఆషాఢ మాసంలోనే ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవం జరుగుతుంది. దాన్ని చూసేందుకు లక్షలమంది తరలివస్తారు. అది ముగిసిన కొద్దిరోజులకే మరోసారి బోనాలతో ఈ ఆలయం పోటెత్తుతుంది. రెండో ఆదివారం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగే ఈ బోనాలను లష్కర్ బోనాలు అని కూడా పిలుస్తారు. సైన్యం విడిది చేసే చోటును లష్కర్ అంటారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంగా ఏర్పడింది కాబట్టి ఇక్కడ జరిగే బోనాలకు ఆ పేరు వచ్చింది.

Bunalu
మూడోవారం సింహవాహినిని చేరుకుని..
అది 1908 సంవత్సరం సెప్టెంబర్ 28. బంగాళాఖాతంలోని తుఫాన్ వల్ల విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ రోజు హైదరాబాద్‌లోనూ జోరున వర్షం మొదలైంది. ఓ అంచనా ప్రకారం మూసీ నది ఏకంగా 60 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఏది నగరమో, ఏది నదో తెలియనంతగా హైదరాబాద్ నీట మునిగింది. వంతెనలు కొట్టుకుపోయాయి, వాడలూ తట్టుకోలేకపోయాయి. అధికారికంగా పదిహేనువేల మందికి పైగా చనిపోయారు. ఆస్తి నష్టానికైతే లెక్కే లేదు.
ఇదంతా చూసిన నాటి నిజాం నవాబు చలించిపోయాడు. ధనవస్తు రూపాలలో ఎంత సాయం చేసినా ప్రకృతి కూడా సహకరించాలనీ, అందుకు అమ్మవారిని వేడుకొమ్మనీ పండితులు సూచించారు. దాంతో ఆయన అమ్మవారిని పట్టువస్ర్తాలు, ముత్యాలు, గాజులు, పసుపు కుంకుమలతో పూజించి వాటిని మూసిలో విడవగానే… నది శాంతించిందని చెబుతారు. నిజాం కొలిచిన ఆ అమ్మవారే లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి. అంతేకాదు! మరెప్పుడూ హైదరాబాద్ వరదల వల్ల అతలాకుతలం కాకూడదనే సంకల్పంతో మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించారు నిజాం. ఆయన పర్యవేక్షణలో ఉస్మాన్ సాగర్,
హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు నిర్మించారు. అలా ఓ ప్రళయానికీ, ప్రశాంతతకీ, అభివృద్ధికీ సాక్షీభూతంగా మారింది సింహవాహిని అమ్మ. ఆషాఢమాసం మూడో ఆదివారం ఆ ఆలయం బోనాలతో పోటెత్తుతుంది.
ఆషాఢమాసంలోని తొలి మూడు ఆదివారాలు ఎంత విశిష్టమో.. ఆఖరి ఆదివారమూ అంతే ప్రత్యేకం. పాతబస్తీతో సహా నగరంలోనూ పల్లెల్లోనూ ఘనంగా బోనాలు జరుగుతాయి. ఓ గుడి చిన్నది కావచ్చు, ఓ గుడి మూలాలు తెలియకపోవచ్చు. కానీ అక్కడ కొలువైన అమ్మ దగ్గరకి చేరుకునే భక్తుల విశ్వాసం ఒక్కటే. మానవ ప్రయత్నం చేస్తూనే.. తన చేతుల్లో లేని ఫలితాన్నీ, భవితనీ ఆ తల్లి చేతిలో ఉంచితే ఢోకా ఉండదని నమ్ముతారు. కష్టం వస్తే అది తనను పరీక్షించే అమ్మ ఆగ్రహమనీ, సుఖం తన అనుగ్రహమనీ భావిస్తారు. అందుకే అంతస్తులు, కులాలు మర్చిపోయి ఓ భక్తుడిగానే అమ్మ సన్నిధికి చేరుకుంటారు. శివసత్తుల పూనకాలు, కుర్రాళ్ల తీన్మార్లు, ఒగ్గు కథలు, డప్పులు.. వీటన్నిటి మధ్యా సాగిపోతారు. బోనాలతో ఆషాఢంలో వచ్చే రోగాలు పోతాయా, కష్టాలన్నీ తీరిపోతాయా, ప్రతి ఒక్కరి ప్రతీ కోరికా నెరవేరుతుందా! కాకపోవచ్చు. కానీ తను ప్రకృతిని మించినవాడిని కాదనీ, తల్లి చల్లని చూపు ఉండాలనీ గుర్తించి.. ఆ మూలాలకి తలొగ్గే మనిషి వినయానికి సూచన బోనం.
అమ్మకు అండగా పోతురాజు
బోనం అనగానే పోతురాజు గుర్తొస్తాడు. తను లేని ఆ వేడుక శూన్యమే. ఒంటినిండా పసుపు, నుదుట ఎర్రటి బొట్టు, పెద్ద మీసాలు, ఎర్రటి ధోవతి, కాలికి గజ్జెలు, చేతుల్లో కొరడా వేపాకులతో భయానకంగా కనిపించే ఈ పోతురాజు ఉగ్రతత్వం భక్తుల మీద కాదు.. దుష్టశక్తుల మీద. ఎందుకంటే తను సాక్షాత్తు ఆ గ్రామదేవతలకు సోదరుడు. వారికి తోడుంటానని మాట ఇచ్చినవాడు. బోనాలకు కాపలాదారుడు. సామూహికంగా జరిగే ఈ కార్యక్రమాల్లో ఎవరూ కట్టుదాటకుండా భయభక్తులతో మెలిగేలా చేసే పాత్రగానూ తనని చూడవచ్చు. పోతురాజుల సందడితోనే బోనాలు మొదలవుతాయి, ముగుస్తాయి కూడా. బోనాలే కాదు… గ్రామదేవతలకు జరిగే జాతరల్లో కూడా పోతురాజు ఉంటాడు. పోతురాజు కొరడాల చప్పుళ్లు, ఆ వెనుకే శివసత్తుల పూనకాలు బోనం తీరునే మార్చేస్తాయి.
ఆయురారోగ్య సిద్ధిరస్తు
వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల
గురించి తెలిసిందే. కలరా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ మొదలుకొని వైరల్ జ్వరాల వరకూ తేమ, మురుగు ఎక్కువగా ఉండే ఈ సమయంలోనే అధికం. ఈ సమస్యలు ఎదుర్కొనేందుకు సాంప్రదాయికంగా వాడే పదార్థాలు బోనాలలో కనిపించడం విశేషం.
…? కె.ఎల్.సూర్య