న్యూఢిల్లీ: భారతదేశ అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. హైదరాబాద్‌కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ అభివృద్ధి చేసిన దేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ శనివారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అనే పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ‘విక్రమ్-1’ భూమి చుట్టూ ఉన్న కక్ష్యలోకి చేరుకుని, అందులో ఉన్న టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ పేలోడ్లను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన పోస్టుకార్డులను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఘనతతో భారతదేశం సొంత ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యం కలిగిన మూడవ దేశంగా నిలిచింది. మూడు దశల ఘన ఇంధన చోదక శక్తిని, అనంతరం ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్‌ని ఉపయోగించి, ఈ రాకెట్ సుమారు 450 కి.మీ. ఎత్తులో ఉన్న కక్ష్యను చేరుకుంది. 3డీ ప్రింటెడ్ ఇంజిన్లు, కార్బన్ కాంపోజిట్ నిర్మాణాలతో అత్యంత ఆధునిక సాంకేతికతతో ఈ రాకెట్‌ను రూపొందించారు.
బీఆర్ఆఎస్ ప్రభుత్వం హయాంలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన టీ- హబ్ ఈ రాకెట్ విజయంలో భాగస్వామ్యం దక్కించుకుంది. టీ-హబ్‌లోని మౌలిక సదుపాయాలతో ఎదిగిన స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి బాటలు వేసింది. పవన్ కుమార్ చందన, నాగభరత్ డాక ఈ సంస్థను 2018లో ప్రారంభించారు. అంతకుముందు వీరు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)లో పనిచేశారు. ఈ ప్రాజెక్టుకు ఇస్రో, ఇన్ స్పేస్ సంస్థలు పూర్తి సహకారాన్ని అందించాయి. సుమారు రూ.526 కోట్ల నిధులను సేకరించిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ ప్రైవేట్ స్పేస్ రంగంలో అగ్రగామిగా ఎదుగుతోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం ఏడు ప్రయోగాలు చేపట్టాలని ‘ఇస్రో’ లక్ష్యంగా పెట్టుకున్నదని ఆ సంస్థ చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. ప్రస్తుతం రెండు ఉప గ్రహాలు సిద్ధంగా ఉన్నాయని, మరో ఐదు నుంచి ఆరు ఉపగ్రహాలు తుది దశలో ఉన్నాయని తెలిపారు.
భారత అంతరిక్ష రంగంలో ‘స్కైరూట్ ఏరోస్పేస్’ విజయవంతంగా చేపట్టిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం ఒక చారిత్రక ఘట్టమని ఆ సంస్థ సీఈవో పవన్ కుమార్ చందన పేర్కొన్నారు. 100 శాతం స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించిన రాకెట్ మొదటి ప్రయత్నంలోనే కక్ష్యలోకి దూసుకెళ్లడం గర్వించదగిన విషయమన్నారు.

Ceo Pawan Kumar Chandana, C
ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ స్థాపించిన ‘స్పేస్ ఎక్స్’, రాకెట్ ల్యాబ్ లాంటి అంతర్జాతీయ సంస్థల సరసన ‘స్కైరూట్’ను నిలిపిన సంస్థ సీఈవో పవన్ కుమార్‌ను ఇప్పుడు భారతదేశపు ఎలాన్ మస్క్ అని అంటున్నారు. 1991లో హైదరాబాద్‌లో జన్మించిన పవన్ కుమార్ ఐఐటీ ఖరగఫూర్లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం ఇస్రోలో శ్రాస్తవేత్తగా చేరి, ఆరేండ్లపాటు జీఎస్ఎల్వీ మార్క్-111 వంటి కీలక ప్రాజెక్టులో పనిచేశారు. 2018లో ఉద్యోగాన్ని వదిలి నాగ భరత్ డాకాతో కలిసి స్కై రూట్ ఏరోస్పేస్ను స్థాపించారు.
ఈ రాకెట్ విజయంపై ప్రధాని మోదీ స్పందిస్తూ, భారత అంతరిక్ష ప్రయాణంలో ఇది ఒక చరిత్రాత్మక మలుపని, దేశ యువతలోని ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు.
విక్రమ్-1 రాకెట్ సక్సెస్‌ను భారత అంతరిక్ష రంగంలో ఒక గర్వించదగ్గ మైలురాయిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్ణించారు. స్కైరూట్ కంపెనీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
‘విక్రమ్-1’ నాలుగు దశలు కలిగిన రాకెట్. ఇది సుమారు 350 కిలోల బరువున్న పేలోడ్లను భూమికి దగ్గరి కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. ఈ రాకెట్ ద్వారా జర్మనీకి చెందిన ‘డీసీయూబెడ్’ సాంకేతిక పరికరం, భారత స్టార్టప్ ‘గ్రహా స్పేస్’కు చెందిన సోలారాస్ ఎస్3 నానో శాటిలైట్, అంతరిక్ష వ్యర్థాలను సేకరించేందుకు ‘కాస్మోసర్వ్ స్పేస్’ రూపొందించిన రోబోటిక్ ఆర్మ్ ‘ఎంబ్రేస్’లను, స్కైరూట్‌కు చెందిన ‘స్కో ప్’ ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించారు.
వరంగల్ చౌరస్తా: ఓరుగల్లు ఖ్యాతి అంతరిక్షాన్ని చేరింది. ఓరుగల్లు శిల్పి మట్టెవాడ అజయ్‌కుమార్ రూపొ ందించిన సూక్ష్మ కళాఖండాలు భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1లో అంతరిక్షానికి చేరుకున్నాయి. సూది రంధ్రంలో రూపొందించిన ముగ్గురు దిగ్గజ శాస్త్రవేత్తల సూక్ష్మ శిల్పాలను అంతరిక్షానికి పంపిన తొలి భారతీయ శిల్పిగా మట్టెవాడ అజయ్‌కుమార్ ఘనత సాధించారు.