ధర్పల్లి, నవంబర్ 24 : మండలంలోని రామడుగు ప్రాజెక్టులో రూ. 15 లక్షల విలువైన 8 లక్షల 10 వేల చేప పిల్లలను ఎంపీపీ నల్ల సారికా హన్మంత్‌రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ కృషితోనే కులవృత్తులు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని అన్నారు. మండలంలో 39 చెరువుల్లో చేప పిల్లలను ఉచితంగా విడుదల చేసి ప్రభుత్వం గంగపుత్రులకు లబ్ధి చేకూరుస్తున్నదని తెలిపారు .
ప్రాజెక్టు వద్ద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మండల అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నవీన్‌రెడ్డి, సర్పంచ్ పుష్పా సుఖేందర్, ధర్పల్లి సర్పంచ్ పెద్దబాల్‌రాజ్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, జిల్లా మత్స్య అధికారి రాజనర్సయ్య, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు రమేశ్, కార్యదర్శి గంగాధర్, సభ్యులు శ్రీధర్, నిఖిల్, సాయి, మహేశ్ పాల్గొన్నారు.