భిక్కనూరు/కామారెడ్డి, మార్చి 24: కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురిసింది. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో వడగండ్ల వాన పడింది. బలమైన గాలులతో వర్షం దంచికొట్టడంతో రైతులకు తీవ్ర నష్టం చేకూరింది. చేతికొచ్చిన వరి, మక్క పంటలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కామారెడ్డి పట్టణంలోనూ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్న వాతావరణం సాయంత్రానికి చల్లబడింది. ఒక్కసారిగా మబ్బులు ఏర్పడి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటకు పైగా పడడంతో డ్రైనేజీలు నిండి రోడ్లపైకి నీళ్లు వచ్చాయి. దీంతో ట్రాఫిక్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు రామేశ్వరపల్లిలో పిడుగు పడి కర్రె గొల్ల లింబాద్రికి చెందిన రెండు బర్రెలు మృతి చెందాయి.
బిచ్కుంద(జుక్కల్), మార్చి 24: జుక్కల్ మండల కేంద్రంలో పాటు పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది. చేతికొచ్చిన మక్క, వరి, జొన్న పంటలు దెబ్బ తిన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.