ఖలీల్వాడి/ధర్పల్లి మే 19 : మోపాల్ మండలంలోని మంచిప్ప, బైరాపూర్తోపాటు ధర్పల్లి మండలంలోని రేకులపల్లిలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో ఆయా గ్రామాల్లో ఇండ్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రేకులపల్లిలో ఎరువు రవికి చెందిన ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయి పక్కనే పడిపోయాయి. విషయం తెలుసుకున్న సర్పంచ్ రాజేందర్ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. తక్షణ సహాయ చర్యలు చేపట్టడంతో పాటు ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిపారు.
మంచిప్ప, బైరాపూర్ గ్రామాల్లో దాదాపు 15 ఇండ్లు కూలిపోగా, రేకులు ఎగిరిపోయాయి. సుమారు 50కి పైగా స్తంభాలు నేలకూలాయి. 11 కేవీ తీగలు పడిపోవడంతో గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నారు. ఈదురుగాలులకు రేకులు లేచిపోవడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వారికి ప్రభుత్వ భవనాలు, బంధువులు ఇండ్లలో సర్పంచులు కేతావత్ శాంత, వసంత, తూర్పు రాజమణి, అధికారులు పునరావాసం కల్పించారు. అక్కడక్కడ కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది.
