మహత్తర పోషక విలువలకు చిరునామా రాగి. తృణధాన్యాల్లోకెల్లా రారాజుగా నిలిచిన రాగితో చేసిన వంటలు ఆరోగ్యప్రదాతలు అని చెప్పడంలో సందేహం లేదు. విద్యార్థులకు అదనపు శక్తి, ఆరోగ్యం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో రాగిజావను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. ఇప్పటికే విద్యార్థుల మెనూపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి పౌష్టికాహారం అందిస్తున్న సర్కారు.. అదనపు శక్తి అందిస్తూ చదువుపై మరింత ఏకాగ్రత నిలిపేందుకు బలవర్ధకమైన రాగిజావను ఇస్తున్నది.
బాన్సువాడ, ఆగస్టు 31: పేద విద్యార్థుల్లో పౌష్టికాహార లోపంతో మానసిక, శారీరక ఎదుగుదల సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. వారంలో మూడు రోజులు గుడ్డు అందిస్తుండగా, దానికి తోడు రాగిజావను అదనంగా అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కేజీ టూ పీజీ ఉచిత విద్య అందేలా విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు సమూల మార్పులు తెచ్చింది. సర్కార్ బడుల్లో చదువుకునే పేద గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యాబోధనతోపాటు పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకున్నది. దానిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసింది. అందులో భాగంగా విద్యార్థి దశలోనే సరైన పౌష్టికాహారం తీసుకుంటే భవిష్యత్తులో విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారన్న సదుద్దేశంతో మధ్యాహ్నం భోజన పథకంలో సోమ, బుధ, శుక్రవారాల్లో ఉడికించిన గుడ్డును భోజనంతోపాటు అందిస్తున్నారు. ఇదే కాకుండా పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ప్రార్థన అనంతరం రాగిజావ అందిస్తున్నది. కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలకు ఇప్పటికే రాగిజావ, బెల్లం పౌడర్ ప్యాకెట్లను అందజేసింది. జిల్లాలోని 656 ప్రాథమిక, 124 ప్రాథమికోన్నత, 182 ఉన్నత పాఠశాలల్లో చదివే సుమారు పదివేల మంది విద్యార్థులకు రాగిజావను పంపిణీ చేస్తున్నారు.
సంపూర్ణ ఆరోగ్యం..
నిరుపేద విద్యార్థులు పాఠశాలకు ఆకలితో వెళ్లకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రాగిజావ పంపిణీకి శ్రీకారం చుట్టారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఉదయం ప్రార్థన ముగియగానే రాగిజావను అందజేస్తున్నది. ఒక్కో పాఠశాల విద్యార్థుల సంఖ్య మేరకు ఇప్పటికే రాగిజావ, బెల్లం ప్యాకెట్లు సరఫరా చేశారు. బాన్సువాడ మండలంలోని 46 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత, 13 హైస్కూల్స్ ఉండగా వాటిలో విద్యనభ్యసించే విద్యార్థులకు రాగిజావను అందజేస్తున్నారు.
విద్యార్థులకు మేలు..
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నది. ఉదయం పూట ఖాళీ కడుపుతో ఉండకుండా రాగిజావను అందజేస్తున్నాం. రాగిజావ మేలు చేకూరుస్తుంది.
– నాగేశ్వర్ రావు, ఎంఈవో
రాగిజావలో న్యూట్రిషన్లు, ఎనర్జిటిక్ మెటీరియల్, ప్రొటీన్లకు సంబంధించిన పోషకాలు ఉంటాయి.
విటమిన్ ఏ 3.5 మి.గ్రా.
విటమిన్ బీ1 0.3 మి.గ్రా.
విటమిన్ బీ2 0.2 మి.గ్రా.
విటమిన్ బీ3 1.0 మి.గ్రా.
విటమిన్ బీ6 5.0 మి.గ్రా.
విటమిన్ బీ7 1.0 మి.గ్రా.
విటమిన్ బీ9 500 మి.గ్రా.
విటమిన్ బీ12 6.3 మి.గ్రా.
విటమిన్ సీ 120 మి.గ్రా.
శక్తి 310 కిలో క్యాలరీస్
ప్రొటీన్లు 7. 4 గ్రాములు
ఫ్యాట్ 14.2 కిలో క్యాలరీస్
కార్బోహైడ్రేట్స్ 66.7 గ్రాములు
షుగర్ 9.7%