ఇందల్వాయి, మే 21: రైతులకు పూర్తిస్థాయిలో మద్దతు ధర అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 4.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎ.శరత్ వెల్లడించారు. చివరి గింజను సైతం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉన్నదన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందల్వాయి సెంటర్లో 8691మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 8459 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల కోసం ట్యాబ్ ఎంట్రీ పూర్తయిందని నిర్వాహకులు ప్రత్యేకాధికారి దృష్టికి తెచ్చారు. ట్యాబ్ ఎంట్రీ సకాలంలో పూర్తయితేనే రైతులకు వేగంగా బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. కొనుగోలు కేంద్రానికి కొంత తక్కువ పరిమాణంలో ధాన్యం తెచ్చిన ఓ రైతు ప్రత్యేకాధికారిని కలిసి గత మూడు రోజుల నుంచి తన ధాన్యాన్ని తూకం చేయడం లేదని ఫిర్యాదు చేయడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఎస్వో చంద్రప్రకాశ్, సివిల్ సప్లయి డీఎం జగదీశ్ ఉన్నారు.
కామారెడ్డి, మే 21: జిల్లాలో ధాన్యం సేకరణ నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి డాక్టర్ శరత్ సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు,ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు , రైస్‌మిల్లర్లతో మంగళవారం సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం రోజూవారి లక్ష్యం నిర్దేశించుకొని కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ ప్రతిరోజు 9వేల మెట్రిక్ టన్నుల మేర, నాలుగు రోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేసేలా తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, ఇన్చార్జి మేనేజర్ నిత్యానందం, డీసీవో రమ్య, వ్వవసాయ శాఖ అధికారిణి భాగ్యలక్ష్మి, రవాణాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
భిక్కనూరు మండలం అంతపల్లి లో కొనుగోలు కేంద్రాన్ని ప్రత్యేకాధికారి పరిశీలించారు. సదాశివనగర్, బీబీపేట, రాజంపేట మండలాల్లోని పలు కేంద్రాల వద్ద ధాన్యం కాంటా చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.