ఎన్నికల వేళ ఎన్నో హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయడాన్ని విస్మరించింది. మొన్నటికి మొన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి మాటతప్పడంతో సర్కారు తీరుపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విసుగు చెందాయి. ఇక లాభం లేదని కళాశాలలను నాలుగురోజులుగా స్వచ్ఛందంగా మూసి వేసి నిరసనలకు పిలుపునిచ్చారు. తమ శ్రమను పట్టించుకోవడం లేదని, పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయడం లేదని, సకాలంలో గౌరవ వేతనాలు అందజేయడం లేదని మధ్యాహ్న భోజన కార్మికులు కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమను చిన్న చూపు చూస్తున్నదని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ జేఏసీ నాయకులు కామారెడ్డి జిల్లాకేంద్రంలో నిరసన చేపట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం వివిధ వర్గాల వారు పోరుబాట పడుతున్నారు.
వార్షిక పరీక్షలు వాయిదా వేయాలి
డిచ్పల్లి, నవంబర్ 6 : వార్షిక పరీక్షలు వాయిదా వేయాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన ద్వారా ఎదుట ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు గురువారం నిరసన చేపట్టాయి. అనంతరం రిజిస్ట్రార్ యాదగిరికి వినతిపత్రం అందజేశాయి. ఈ సందర్భంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి మాట్లాడారు. నాలుగేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను రాష్ట్రప్రభుత్వం విడుదల చేయకపోవడంతో నాలుగు రోజులుగా కళాశాలలను మూసి నిరసన తెలుపుతున్నామన్నారు. ఓ వైపు కళాశాలలు బంద్ ఉండడంతో విద్యార్థులు పరీక్షా ఫీజులు కట్టేందుకు కూడా రాలేదని, ఇంకా సుమారు 40 శాతం మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉందని తెలిపారు.
ఈ కళాశాలల బంద్ పూర్తయ్యే వరకు పరీక్షల టైంటేబుల్ విడుదల చేయవద్దని, పరీక్షా ఫీజు చెల్లింపు గడువును కూడా పెంచాలని కోరారు. జిల్లా ప్రధానకార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. నాలుగేండ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలు కోలుకోలేని విధం గా దెబ్బతిన్నాయని, ఇప్పుడు కళాశాలలు తెరిచినా సిబ్బంది పనిచేయడానికి సుముఖంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి తమను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో టీయూ పరిధిలోని కళాశాలల యాజమాన్యాలు, బాధ్యులు జైపాల్‌రెడ్డి, నరాల సుధాకర్, మారయ్యగౌడ్, శంకర్, శ్రీనివాసరాజు, గురువేందర్‌రెడ్డి, అరుణ్, గిరి, రమణ, సత్యం, దత్తు, విజయ్, గంగాధర్, చందన్, గంగారెడ్డి, రషీద్, షకీల్, వెంకటకిషన్ తదితరులు పాల్గొన్నారు.
‘మధ్యాహ్న భోజన’ బిల్లులు చెల్లించాలని కార్మికుల ధర్నా
కామారెడ్డి, నవంబర్ 6 : పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న రూ. 2.28 కోట్లు వెంటనే చెల్లించాలన్నారు. గ్రీన్‌ఛానల్ ద్వారా ప్రతి నెలా 5వ తేదీలోగా వంట సరుకుల బిల్లులు, వేతనాలు చెల్లించాలని కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు వెంకటేశ్, సరస్వతి, ప్రమీల, పరశురాములు, దుర్గయ్య, సత్తయ్య, వాణి, స్వప్నారెడ్డి, రజిత తదితరులు పాల్గొన్నారు.
‘ఫీజు’ కోసం కండ్లకు గంతలు కట్టుకొని..
కామారెడ్డి, నవంబర్ 6 : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు గురువారం కండ్లకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టారు. జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన అనంతరం వారు మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న రూ.10,500 కోట్ల విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నదని అన్నారు. నాలుగు రోజులుగా తెలంగాణలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్ చేపట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్లు నియంత వైఖరి అవలంబించడం సరి కాదన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్, నాయకులు రాహుల్, శివ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్లు కల్పించాలని బీసీల మౌనదీక్ష
కామారెడ్డి, నవంబర్ 6 : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మహాత్మా జ్యోతీబాఫూలే, అంబేద్కర్ విగ్రహాల వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, చట్టబద్ధంగా 9వ షెడ్యుల్‌లో చేర్చి బీసీల హక్కులను నెరవేర్చాలని అన్నారు. తమిళనాడు రాష్ట్రం తరహాలో 50 శాతం సీలింగ్ ఎత్తేసి, బీసీలకు జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమాన్ని ‘మెమెంతో మాకంత’ నినాదంతో ఉధృతం చేస్తామన్నారు. త్వరలో జిల్లాకేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు సాప శివరాములు, నీల నాగరాజు, కుంబాల లక్ష్మణ్ యాదవ్, పండ్ల రాజు, కన్నయ్య, పున్న రాజేశ్వర్, గుడుగుల శ్రీనివాస్, మల్లన్న, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.