ఖలీల్‌వాడి, డిసెంబర్ 22: కేంద్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, రాష్ట్రం పై అసత్య ప్రచారం చేస్తుండడంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేం ద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుండడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా అన్ని జిల్లాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా పాల్గొననున్నారు. తెలంగాణ ప్రభుత్వం కల్లాలు నిర్మిస్తే ఆ నిధులు వెనక్కి ఇవ్వాలని అడగడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉన్న వ్యవసాయ కల్లాల నిర్మాణానికి ఖర్చయిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలంటూ కేంద్రప్రభుత్వం రాష్ర్టానికి నోటీసు ఇవ్వడంపై ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడమే కాకుండా అసత్య ప్రచారం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని రైతాంగం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తోందన్నారు. ప్రతి రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న వివక్షపూరిత వ్యతిరేక వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు ఉమ్మడి నిజా మాబాద్ జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహించనున్నారు. ఈ ఆందోళనలో రైతులు స్వచ్ఛందంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పిలుపునిచ్చారు.