బిచ్కుంద : కాంగ్రెస్ ( Congress) నాయకుల మోసపు మాటలకు బలికావద్దని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ( Hanmanth Shinde ) అన్నారు. గత రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని సంక్రాంతి పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో బీఆర్ఎస్( BRS ) ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ముగ్గులు వేసి నిరసన ( Protest) చేపట్టారు.

ఈ సందర్భంగా పట్టణంలోని కమ్మరిగుడి నుంచి అంబేద్కర్ చౌరాస్తా వరకు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి ‘ రోడ్డు బనావో.. బిచ్కుంద బచావో ’ అంటు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లల్లో రోడ్డు పక్కన ఇండ్ల వద్ద ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు మంజూరయ్యాయని గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 25 నెలలు గడుస్తున్న పూర్తి చేయడంలేదని, రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. తాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మద్దెల చెరువు గ్రామం నుంచి కందర్పల్లి గ్రామం వరకు రెండు వరుసల రోడ్డుకు రినువల్ చేయడం జరిగిందని, ఆ పనులు పుల్కల్ గ్రామం వరకు వేసి అసెంబ్లీ ఎన్నికల కోడ్ పడడంతో ఆపివేశామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్, నాయకులు నాల్చర్ బాలాజీ, నాల్చర్ శ్రీనివాస్, యాదారావు, డాక్టర్ రాజు, పిట్ల సాయికుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గాంధీ భవన్‌గా మారిన బిచ్కుంద మఠం
పట్టణంలోని బండయప్ప మఠం గాంధీ భవన్‌గా మారిందని హన్మంత్ షిండే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ మఠాధిపతి సోమయప్ప స్వామి కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రసిద్ధిగాంచిన మఠం రాజకీయాలకు అతీతంగా, ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చే ధర్మ గురువు స్థానంలో ఉన్న మఠాధిపతి రాజకీయాలు చేయడం మానేసి బండయప్ప మఠం అభివృద్ధికోసం పాటుపడాలని కోరారు.