కంఠేశ్వర్, మార్చి 17: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పని చేసే కార్మికులు, డ్రైవర్లు మంగళవారం చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల వైఫల్యం కారణంగా దాదాపు రెండు గంటల పాటు టెన్షన్ వాతావరణం నెలకొన్నది. సమస్యలు పరిష్కరించాలని, సీఐజీ గ్రూప్‌లను కొనసాగించాలని, ఏజెన్సీలను రద్దు చేసి, కొత్త గ్రూప్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీయూసీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ సంయుక్త ఆ ధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లు భారీ ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు వారిని లోనికి అనుమతించలేదు. అయితే, పోలీసులు తక్కువ మందే ఉండగా, పెద్ద సంఖ్యలో ఉన్న కార్మికులు ఒక్కసారిగా లోనికి చొచ్చుకెళ్లారు.
మున్సిపల్ కమిషనర్ చాంబర్ ఎదుట బైఠాయించిన కార్మికులు దాదాపు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. వారి నినాదాలతో కార్యాలయం మార్మోగింది. మరోవైపు, ఆఫీసులోని మొదటి అంతస్తులో ఉన్న డిప్యూటీ కమిషనర్ చాంబర్లోకి చొచ్చుకెళ్లేందుకు మహిళా కార్మికులు యత్నించగా, పోలీసులు అడ్డుకోవడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో మహిళా కార్మికులు పార్వతి, మాధవి సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడున్న వారు సపర్యలు చేసి అంబులెన్స్‌లో దవాఖానకు పంపించారు.
కార్మికుల ఆందోళనతో బల్దియాలో కార్యకలాపాలు పూర్తిగా నిలిచి పోయాయి. ఏం జరుగుతుందో తెలియక తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు, 14 రోజుల్లో తమ డిమాండ్లను పరిష్కరించక పోతే సమ్మెకు దిగుతామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.రమేశ్‌బాబు, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చరించారు. పారిశుద్ధ్య విభాగంలో అవుట్సోర్సింగ్ కార్మికులతో ఇప్పటికే కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ (సీఐజీ)లు ఉన్నాయని, ఇవి కాకుండా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో 330 మంది కార్మికులు ఉన్నారన్నారు. వాటర్ వర్క్స్ కార్మికులు, డ్రైవర్లు సీఐజీ గ్రూపుల్లో లేరని, వీరిని మాత్రమే కొత్తగా గ్రూపులుగా చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న సీఐజీ గ్రూపులను రద్దు చేసి కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలనుకోవడం సరైంది కాదన్నారు. పాత సీఐజీ గ్రూపులను కదపాలని చూస్తే పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామన్నారు. ఏజెన్సీ కార్మికులకు వేతనాలు ఇచ్చి, సీఐజీ కార్మికులకు వేతనాల ఆపడం అన్యాయమన్నారు. ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో బుధవారం సాయంత్రంలోగా జీతాలు ఇవ్వాలన్నారు. లేకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు. మున్సిపల్ కార్మి క సంఘాల నాయకులు భూపతి రాజేశ్వర్, కిరణ్, గోవర్ధన్, రవి, కిషోర్, నవీన్, సావిత్రి, చంద్రశేఖర్, బాలాజీ, హరీశ్, సుజాత, కార్మికులు, డ్రైవర్లు పాల్గొన్నారు.