మోర్తాడ్, జనవరి 15: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ వెంటాడుతూనే ఉంటామని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని బీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. నందిపేట్‌లో పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు బీఆర్ఎస్ నాయకులను బాల్కొండ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. దీంతో రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు బాల్కొండ పోలీస్‌స్టేషన్ ఎదుట బుధవారం రాత్రి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ..
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదికి ఒక్కో గ్రామానికి పది ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చావని, ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని అన్నారు. ఇద్దరిని అరెస్టు చేసిన విషయం తెలుసుకొని, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వారిని విడిపించారని తెలిపారు. ఎమ్మెల్యేకు ధైర్యం ఉంటే.. మాటల్లో ఫైర్ ఉంటే ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని సవాల్ విసిరారు. పోలీస్‌స్టేషన్‌లోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ నాయకులు దాడిచేశారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గురువారం ఇన్చార్జి సీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.