ఖలీల్‌వాడి, అక్టోబర్ 13: బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదా? అని పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు బొర్ర నాగరాజు ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్కూళ్ల బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను రానివ్వడం లేదని తెలిపారు. పాఠశాలల యాజమాన్యాలు సైతం రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగాయని అన్నారు.
బకాయిలు విడుదల చేయపోవడంతో పాఠశాల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతూ, విద్యార్థులను పాఠశాలల నుంచి పంపివేయడంతో చదువులకు దూరంగా కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి బాబు, బీఎస్పీ ఈసీ అడ్వకేట్ ఈశ్వర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, నాయకులు విఠల్ నాయక్, రాచకొండ విఘ్నేశ్, బోడ అనిల్, డాక్టర్ కర్క గణేశ్, సిరివేని సంతోష్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్‌తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.