మోర్తాడ్/ధర్పల్లి/సిరికొండ/ఆర్మూర్ టౌన్/భీమ్‌గల్/బోధన్ రూరల్, ఫిబ్రవరి 4: సర్పంచులకు అందాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాజా మాజీ సర్పంచులు చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ని ఉమ్మడి జిల్లాలో పోలీసులు అడ్డుకొన్నారు. ముందస్తు అరెస్టులు చేశారు. మోర్తాడ్, ధర్పల్లి, సిరికొండ, ఆర్మూర్, బోధన్ తదితర మండలాల్లో తాజా మజీ సర్పంచులను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు.
కక్ష గట్టిన రేవంత్ సర్కార్
తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను అడగడానికి వెళ్తే అరెస్టు చేయడం శోచనీయమని తాజా మాజీ సర్పంచులు అన్నారు. ఏడాదిగా బిల్లుల ఊసేలేదన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు పొందిన సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా కక్షగట్టి ఇండ్లకు వచ్చి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా వారిని మరింత ఊబిలోకి నెట్టడం సరికాదన్నారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, లేదంటే పాలన చేతకాదని ఒప్పుకోవాలన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇచ్చి వారిని గౌరవంగా చూడాలని సుద్దపూస మాటలు మాట్లాడి ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సర్పంచులపై కక్షగట్టి ఏడాదిగా బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.