ఖలీల్‌వాడి, జూన్ 17 : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటన దురదృష్టకరమని.. రైల్వే పోలీసు బలగాల కాల్పుల్లో ఒకరు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడడంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొన్న కిసాన్‌ను, నేడు జవాన్‌ను రోడ్డు మీద పడేసిన ఘనత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే దక్కిందన్నారు.
అగ్నిపథ్ పథకం తెచ్చి దేశ రక్షణ కోసం తమ సేవలు అందించాలనుకునే ఆసక్తి గల యువతను బీజేపీ ఘోరంగా అవ మానిస్తోందని, దేశాన్ని సాకే రైతన్నలను, దేశానికే రక్షణగా నిలిచే సైనికుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం హేయనీయమన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అల్లర్ల వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని ఆరోపణలు చేయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని.. బీహార్, ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఆందోళనల వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. యువత సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.