ఇష్టారాజ్యంగా మారిన పరిపాలన పాలకవర్గం నియామకంలో తాత్సారం రిజిస్ట్రార్ చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహారం విద్యార్థుల వసతి గృహాల్లో లోపించిన పరిశుభ్రత
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ యూనివర్సిటీకి దిశానిర్దేశం చేసే వారు కరువయ్యారు. ఇన్చార్జి వీసీ సారథ్యంలోనే వ్యవహారమంతా నడుస్తున్నది. ప్రభుత్వం నియమించిన ఇన్చార్జి వీసీ కనీసం చుట్టపు చూపునకైనా ఇటువైపు రావడం లేదు. బాధ్యతలు తీసుకుని ముఖం చాటేస్తున్నారు. దీంతో పరిపాలన గాడి తప్పుతున్నది. ప్రభుత్వంలో పలు శాఖలకు అధిపతులుగా ఉండడంతో సీనియర్ ఐఏఎస్ అధికారులంతా ఇన్చార్జి వీసీ పోస్టుకు న్యాయం చేయలేకపోతున్నారు. ఫలితంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది. గందరగోళంగా మారిన పరిపాలనతో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. ఏడాదిన్నర కాలంగా శాశ్వత వీసీ లేడు. వీసీల నియామకానికి ప్రభుత్వం చేస్తున్న కసరత్తు సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉన్నది. ఓ వైపు శాశ్వత వీసీ నియామకం జరుగక, మరోవైపు ఇన్చార్జి వీసీ సందీప్ కుమార్ సుల్తానియా పత్తా లేకపోవడంతో టీయూలో జవాబుదారీతనం కొరవడింది.
-నిజామాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తెలంగాణ యూనివర్సిటీ 2006, జూన్ 18న ఆవిర్భవించింది. మొదట గిరిరాజ్ కళాశాలలో తాత్కాలిక ఏర్పాట్ల మధ్య ఏర్పడి తదనంతరం డిచ్పల్లిలోని ప్రస్తుత క్యాంపస్‌కు తరలించారు. ఇక్కడి నుంచి సౌత్ క్యాంపస్ పేరిట కొన్ని విభాగాలను కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌లోని జంగంపల్లిలో బీటీఎస్‌కు తరలించారు. తెలంగాణ యూనివర్సిటీ ఆవిర్భావం నుంచి 18 ఏండ్లలో 16 మంది వీసీలు పనిచేస్తే ఇందులో ఏడుగురు ఇన్చార్జి వీసీగా ఐఏఎస్ అధికారులే నియమితులయ్యారు. వీరి ఆధ్వర్యంలోనూ ప్రభుత్వాలు ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. పూర్తిస్థాయిలో ఐఏఎస్ అధికారులు దృష్టి సారించకపోవడంతో పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లుగా టీయూ పరిస్థితి దాపురిస్తున్నది.
2024, ఫిబ్రవరిలో తెలంగాణ యూనివర్సిటీ పాలకవర్గం గడువు ముగిసింది. ఈసీ గడువు తీరినప్పటికీ నియామక ప్రక్రియకు అడుగు ముందుకు పడలేదు. విద్యా వ్యవస్థతో సంబంధం కలిగిన వ్యక్తులను ఈసీలో సభ్యులుగా చేర్చుతారు. పాలకవర్గం నియామకానికి తాత్సారం జరుగుతున్నది. ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా, దరఖాస్తులను స్వీకరించకుండానే పేర్లను ఫైనల్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. విద్యార్హతలు, ఇతరత్రా అనుభవాలు పక్కన పెట్టి అధికార పార్టీ నేతలు సూచిస్తున్న పేర్లను ఖరారు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. తెలంగాణ యూనివర్సిటీకి ప్రస్తుతం సర్వాధికారాలను గుప్పిట్లో పెట్టుకున్న వ్యక్తి చక్రం తిప్పుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసీ మెంబర్లలో తన వారికి చోటు కల్పిస్తే భవిష్యత్తులో ఏ నిర్ణయానికైనా ఢోకా ఉండదన్న ధీమాలో సదరు కీలక ఆచార్యుడు భావిస్తున్నట్లుగా యూనివర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. వీసీ తొలగింపు తర్వాత జరిగిన గందరగోళ వ్యవహారాలన్నీ బయటికి రావొద్దంటే బయటి వ్యక్తులకు స్థానం లేకుండా చేయడమే పరిష్కారం అన్నట్లుగా పావులు కదుపుతున్నట్లుగానూ ప్రచారం జరుగుతున్నది. సర్కారు నుంచి పాలకవర్గం నియామకానికి ఆదేశాలు వచ్చినా గుట్టుగా ఈ వ్యవహారాన్ని కానిస్తుండడంపై సర్వత్రా అనుమానాలకు తావిస్తున్నది. బాలికలు, బాలుర వసతి గృహాల్లో వడ్డించే భోజనంలో పలుమార్లు అపరిశుభ్రమైన ఆహారం వెలుగు చూసింది. ఓసారి బల్లి, మరోసారి పురుగు, బొద్దింకలు రావడంతో విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వరుస ఘటనలపై ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం విడ్డూరంగా మారింది.
తెలంగాణ యూనివర్సిటీలో తప్పు చేసేనోళ్లదే రాజ్యం. నిబంధనలు పాటించని వ్యక్తులే రాజ్యమేలుతున్నా.. వారికే వీసీలు, రిజిస్ట్రార్లు వంత పాడుతుండడంతో బోధన, బోధనేతర సిబ్బందిలో క్రమశిక్షణ పూర్తిగా సన్నగిల్లింది. ఉదాహారణకు నెలల తరబడి యూనివర్సిటీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఆచార్యుల తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి కొద్దిరోజుల కిందట సౌత్ క్యాంపస్‌లో తనిఖీలు చేపట్టారు. ఒకరిద్దరు ప్రొఫెసర్లు హాజరు కాకపోవడంతో రిజిస్ట్రారే స్వయంగా సీఎల్(క్యాజూవల్ లీవ్) పేరిట రిమార్క్స్ రాశారు. సీన్ కట్ చేస్తే సదరు ప్రొఫెసర్ మాత్రం నెలతిరిగే సరికి జీతం కోసం ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్కు క్లెయిమ్స్ పెట్టుకున్నారు. రిజిస్ట్రార్‌కు ఈ విషయం తెలియడంతో బిల్లును వాపస్ పంపించారు. కానీ సదరు ఆచార్యురాలిపై మాత్రం చర్యలు మాత్రం తీసుకోలేదు. జీతం కోసం ఫైల్ మూవ్మెంట్ చేసిన పరిపాలన విభాగం వారిపైనా విచారణ లేదు. ఇది మచ్చుకో ఉదాహారణ మాత్రమే. ఇలాంటి తతంగాలు అనేకం జరుగుతున్నాయి. డిచ్పల్లి మెయిన్ క్యాంపస్‌లో ఈ ఏడాది ప్రారంభంలో గంజాయి సరఫరా కేసులో కెమిస్ట్రీ విభాగానికి చెందిన ఆచార్యుడు అరెస్టు కాగా లోతుగా విచారిస్తే నెలల తరబడి యూనివర్సిటీకి రాకున్నా జీతం మాత్రం ఠంఛనుగా పుచ్చుకున్నట్లుగా తేలింది. అక్రమాన్ని సక్రమంగా మలుచుకుంటున్న ఇంటి దొంగలు చాలా మంది ఉండగా వారి తప్పులను మాఫీ చేస్తూ యూనివర్సిటీ పెద్దలే అండదండలు అందిస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి.