నిజామాబాద్, ఆగస్టు 21, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ తీరుపై విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు గుర్రుమంటున్నారు. అధికారంలో లేనప్పుడు ఒక మాట… అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటంపై కన్నెర్ర చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం గతంలో పోరాటాలు చేసిన వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ భేషరతుగా మద్ధతు ఇచ్చింది. నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. వీరి డిమాండ్లు సహేతుకమైనవేనని ప్రకటించి… కేసీఆర్ సర్కారుపై నిందలు మోపారు. సీన్ కట్ చేస్తే 33 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే రాష్ట్రంలో కొనసాగుతోంది. నాడు హామీలిచ్చిన వ్యక్తే ఇప్పుడు ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు. కానీ వీఆర్ఏల డిమాండ్ల పరిష్కారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
రెండున్నరేళ్లుగా వీఆర్ఏలు ఆందోళన చేస్తున్నారు. అడపాదడపా ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు. కనికరం లేకుండా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష హోదాలో ఒక విధంగా, అధికారంలో ఉంటే మరో విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడంపై గ్రామ రెవెన్యూ సహాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని… వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటుగా పేస్కేల్, ఉద్యోగ భద్రత ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో వీఆర్ఏలు మరోసారి తమ ఆవేదనను వెళ్లగక్కేందుకు సిద్ధం అవుతున్నారు.
తెలంగాణ గ్రామీణ రెవెన్యూ వ్యవస్థకు వెన్నెముకగా పని చేసిన వీఆర్ఏల సమస్య మళ్లీ రాజకీయ చర్చకు దారి తీస్తోంది. గతంలో వీఆర్ఏలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వారి సమస్యలపై బహిరంగంగా స్పందించారు. పేస్కేల్ అమలు, అర్హులైన వారికి పదోన్నతులు, ఉద్యోగ భద్రత, మృతి చెందిన వీఆర్ఏల కుటుంబాలకు పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వంటి అంశాలపై అప్పటి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో వీఆర్ఏల ఆందోళనకు కాంగ్రెస్ నేతలు మద్ధతు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యను పరిష్కరిస్తామనే రాజకీయ భరోసా కల్పించడం సహజంగానే వీఆర్ఏల్లో ఆశలు పెంచింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతోన్న వీఆర్ఏల సమస్యలన్నింటికీ ఒకే సమగ్ర పరిష్కారం కనిపించడం లేదు.
నిజామాబాద్ జిల్లాలో వీఆర్ఏల సమస్య చిన్నది కాదు. 2025లోవెలువడిన జిల్లా స్థాయి వివరాల ప్రకారం 1628 మంది పూర్వ వీఆర్ఏలు జిల్లాలో ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 1520 మంది వీఆర్ఏలు ఉన్నారు. వీఆర్ఏగా సంవత్సరాల తరబడి పని చేసిన వ్యక్తికి కేవలం విద్యార్హత నిబంధనల ఆధారంగా మళ్లీ ఉద్యోగ పరీక్ష పెట్టడం న్యాయమా? అనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. తక్కువ గౌరవ వేతనం, పేస్కేల్ లేకపోవడం, ప్రమోషన్లు లేకపోవడం, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి వంటి సమస్యలను వీఆర్ఏలు ప్రస్తావిస్తున్నారు. మిగిలిన వీఆర్ఏల ఉద్యోగ క్రమబద్ధీకరణతో పాటుగా 61ఏళ్లు దాటిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు అనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గ్రామీణ రెవెన్యూ వ్యవస్థలోకి రావాలనుకునే మాజీ వీఆర్ఏలకు జీపీవో వ్యవస్థలో అవకాశం ఇవ్వాలని వీఆర్ఏలు కొట్లాడుతున్నారు.
2023 జూలైలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ… పని చేస్తున్న వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ పే స్కేల్‌తో సర్దుబాటు చేసే నిర్ణయం తీసుకుంది. నాటి ప్రభుత్వం సుమారు 16,500 మందికి పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ ప్రక్రియలో 61ఏళ్లు పైబడిన 3,797 మంది వీఆర్ఏల సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. వీరి వారసులకు విద్యార్హతలను అనుసరించి అటెండర్, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ నియామక ఉత్తర్వులు జారీ కాలేదు. అప్పటికే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్‌తో ప్రక్రియకు బ్రేక్ పడింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉండగా సహజంగానే తప్పించుకుని తిరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీఆర్ఏలకు పెద్దపీట దక్కింది.
ఉద్యోగ భద్రత లభించింది. కాంగ్రెస్ హయాంలో ఆదుకునే నాథుడే లేకుండా పోయారని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ సమస్య న్యాయమైనదని చెప్పిన కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సమస్యపై ఎందుకు తుది నిర్ణయం తీసుకోవడం లేదని వీఆర్ఏలు ప్రశ్నిస్తున్నారు. వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థలను తిరిగి అదే పేర్లతో తీసుకు రాకుండా గ్రామ పాలన అధికారులు(జీపీవో)ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు జీపీవో వ్యవస్థను నెలకొల్పారు. గతంలో వీఆర్ఏలు, వీఆర్వోలుగా పని చేసిన వారికి అర్హత పరీక్ష ద్వారా అవకాశం కల్పించారు. వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించలేదు. క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టలేదు.