విద్యానగర్/ ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 26: పోలియో మహమ్మారి నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నెల 27 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం వైద్యాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం గతంలోనే నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆలస్యమైంది. ఆది,సోమ, మంగళ వారాలు మూడురోజులపాటు ఉదయం 7 నుంచి సాయత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. గతేడాది పోలియో చుక్కలు వేసుకున్నవారు జ్వరం, దగ్గు, జలుబు, విరేచనాలు, ఏ ఇతర జబ్బులతో బాధ పడుతున్నా చుక్కలు వేయవచ్చని వైద్య సిబ్బంది తెలిపారు. జబ్బుతో దవాఖానలో చేరిన వారికి, ప్రయాణంలో ఉన్న వారికి, అప్పుడే పుట్టిన శిశువుకు పోలియో చుక్కలు వేయించాలని వైద్యలు సూచిస్తున్నారు.ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వైద్యాధికారులు ఏర్పాట్లు చేశారు.
కామారెడ్డి జిల్లాలో పోలియో చుక్కలు వేయడానికి 638 కేంద్రాలను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,10,957 ఇండ్లు ఉండగా, 1,03,980 చిన్నారులను గుర్తించారు. వీరందరికీ పోలియో చుక్కలను వేయనున్నారు. జిల్లాలోని అన్ని ఆవాస ప్రాంతాల్లోని 20 ప్రాథమిక కేంద్రాలు, మూడు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 23 ప్రయాణ కూడళ్లలో 23 మొబైల్ బృందాల ద్వారా చుక్కల మందు వేయనున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లతోపాటు ప్రధాన కూడళ్లలో పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 64 మంది సూపర్వైజర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశ వర్కర్లు, విద్యాశాఖ నుంచి 2,552 మందిని నియమించారు. జిల్లాలో 206 కేంద్రాలను అధికారులు హైరిస్కు ప్రాంతాలుగా గుర్తించారు.ఇందులో ఇటుక బట్టీలు, మురికివాడల్లో నివసించేవారితోపాటు సంచార జాతులు, వలస వచ్చిన ప్రాంతాల వారు ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో ఇప్పటికే పలు మండలాల్లో వైద్యాధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా ఐదేండ్లలోపు పిల్లలు లక్షా 87, 819 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 1007 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో అర్బన్ బూ త్లు 241, రూరల్ 766, ట్రాన్సెట్ 37, మొబైల్ బూత్‌లు 37 ఉన్నాయి. జిల్లాలో వ్యాప్తంగా మొత్తం 4,277 బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో 401 మంది సూపర్వైజర్లు, 333 మంది ఏఎన్ఎంలు, 1212 మంది ఆశ వర్కర్లు ఉన్నారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ పరిధిల్లోనూ పోలియో చుక్కల కార్యక్రమం ఉంటుంది. శనివారం కలెక్టరేట్లో పల్స్ పోలియో ర్యాలీని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం జెండా ఊపి ప్రారంభించారు.
ఆదివారం బూత్‌లలో పోలియో చుక్కలు వేయనున్నారు. సోమ, మంగళవారాల్లో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. పోలియో చుక్కలు వంద శాతం వేసేందుకు వైద్యారోగ్యశాఖ సర్వం సిద్ధం చేస్తున్నది.ఈ కార్యక్రమాన్ని ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించనున్నారు.
నేడు నుంచి మొదలవుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. వందశాతం పూర్తి చేసేలా ప్రతి ఒక్క రూ పని చేయాల్సిన అవసం ఉంది. పల్స్ పోలియో కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
-సుదర్శనం, డీఎంహెచ్‌వో, నిజామాబాద్
వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని జిల్లాలో పలు చోట్ల అవగాహన కల్పించాం. జిల్లా వ్యాప్తంగా నేడు 638 కేంద్రాల్లో 1,03,980 చిన్నారులకు పోలియో చుక్కలను వేయనున్నాం. మొదటి రోజు పోలియో చుక్కలు వేసుకోని వారికి తరువాత రోజు అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పోలియో చుక్కలు వేస్తారు.
-డాక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో, కామారెడ్డి