నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 29: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాక సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున వామపక్ష పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జిల్లా కేంద్రంతోపాటు నవీపేట, బోధన్, మాక్లూర్, ఆర్మూర్, జక్రాన్‌పల్లి తదితర మండలాల్లో సీపీఐ (ఎంఎల్), ప్రజాపంథా (మాస్‌లైన్) నాయకులను నిర్బంధించారు.
ఈ సందర్భంగా సదరు నాయకులు మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో బీజేపీ నాయకులు శ్రద్ధ చూపాల్సింది పోయి ప్రారంభించిన పసుపు బోర్డునే మరోసారి ప్రారంభించడం ప్రజలను మభ్యపెట్టడమే అవుతుందన్నారు. జిల్లాలో విమానాశ్రయం కోసం ఏండ్లుగా డిమాండ్ చేస్తున్న పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. పసుపుబోర్డు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల రాలేదని రైతాంగ పోరాటాల ఫలితంగా వచ్చిందని , అలాంటి పసుపుబోర్డు ప్రారంభానికి వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రిని తాము ఎందుకు అడ్డుకుంటామని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో కామ్రేడ్ డీవీకే వర్ధంతి సభకు వెళ్లకుండా పోలీసులు తమను అక్రమంగా అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు. ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతులను నొక్కే యత్నాలు చేస్తున్నాయని, ఇలాంటి చర్యలు మానుకోవాలన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ రెండు ఒక్కటేనని అన్నారు. కేంద్ర మంత్రి వస్తే దానికి వత్తాసు పలుకుతూ వామపక్ష పార్టీ నాయకులను పోలీసులతో అరెస్ట్‌లు చేయించడం సిగ్గుచేటన్నారు.