కామారెడ్డి, మార్చి 27: పదో తరగతి గణిత ప్రశ్నల లీకేజ్ కేసులో నిందితులను కటకటాల్లోకి పంపించారు పోలీసులు. జుక్కల్ ప్రభుత్వ పాఠశాలలోని పరీక్షా కేంద్రం నుంచి బుధవారం గణిత ప్రశ్నలు బయటకు వచ్చిన ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఇద్దరు మైనర్లు సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కేసు వివరాలను ఎస్పీ రాజేశ్చంద్ర గురువారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు.
జుక్కల్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి రాస్తున్న ఓ విద్యార్థికి సాయం చేసేందుకు అతడి తండ్రి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. గణిత పరీక్ష రాస్తున్న విద్యార్థి ఐదు ప్రశ్నలను తెల్ల కాగితంపై రాసి, పరీక్షా కేంద్రంలో నీళ్లు సరఫరా చేస్తే వ్యక్తితో బయటికి పంపించాడు. ఆ కాగితాన్ని తీసుకున్న విద్యార్థి తండ్రి.. అందులో ఉన్న ప్రశ్నలకు జవాబులు తీసుకురావాలని తనకు సన్నహితుడైన కారోబార్కు పేపర్ ఇచ్చాడు. ఆ కాగితాన్ని అక్కడే ఉన్న విలేకరికి పంపించగా, అతడి నుంచి యూట్యూబ్ రిపోర్టర్‌కు, అక్కడి నుంచి మరో రిపోర్టర్‌కు వాట్సప్‌లో చేరింది. ఆ పేపర్ క్లిప్పింగ్‌ను లోకల్‌గా ఉన్న డిజిటల్ మీడియా గ్రూప్‌లో పోస్ట్ చేయడంతో ప్రశ్నలు బయటకు వచ్చిన విషయం వైరల్ అయింది.
ఈ విషయం తెలుసుకున్న ఫ్లయింగ్ స్కాడ్ రంగంలోకి దిగడంతో మొత్తం బాగోతం బయటకొచ్చింది. మాల్ ప్రాక్టీస్‌కు ప్రయత్నించిన ఈ ఉదంతంలో 11 మందిపై కేసులు నమోదు కాగా, ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు మైనర్లు, ఆరుగురు మేజర్లు ఉన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో ఓ యూట్యూబ్ చానల్ విలేకరి, వాట్సప్ గ్రూప్ అడ్మిన్ కూడా ఉన్నారని చెప్పారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, ఎస్బీ సీఐ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.