ఎడపల్లి, ఫిబ్రవరి 2: కన్న తండ్రే కాలయముడిగా మారాడు. ఎన్నికల్లో పోటీకి ముగ్గురు సంతానం నిబంధన అడ్డంకిగా మారిందన్న భావనతో దారుణానికి ఒడిగట్టాడు. ఒక బిడ్డను అడ్డు తొలగిస్తే పోటీ చేయవచ్చునని భావించి ఉన్మాదిగా మారాడు. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని నిజాంసాగర్ కెనాల్లో తోసేసి హతమార్చాడు. గత నెల 29న ఎడపల్లి మండలం ఏఆర్పీ గ్రామ శివారులోని నిజాంసాగర్ డీ-46 కెనాల్లో లభించిన పాప మృతదేహం కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసు వివరాలను సీపీ సాయిచైతన్య సోమవారం ఎడపల్లి ఠాణాలో విలేకరులకు వెల్లడించారు.
వాట్సప్ స్టేటస్‌తో..
గత నెల 29న ఎడపల్లి ఏఆర్పీ గ్రామ శివారులోని నిజాంసాగర్ డీ-46 కెనాల్లో ఆరేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు అధికారులు.. మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మృతి చెందిన చిన్నారి ఎవరో తెలియక పోవడంతో పోలీసులు మృతదేహం ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇదే సమయంలో కానిస్టేబుల్ సుధీర్ తన వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకోగా, మహారాష్ట్రలోని ముఖేడ్ మండలం కేరూర్ ప్రాంతానికి చెందిన బంధువులు, గ్రామస్తులు చూసి చిన్నారి తమకు తెలుసని పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు నేరుగా సదరు గ్రామానికి వెళ్లి విచారించగా అసలు విషయం బయట పడింది.
ఎన్నికల్లో పోటీ చేయడానికి హత్య..
కేరూర్ గ్రామానికి చెందిన కొండమంగలి పాండురంగకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. త్వరలో అక్కడ జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పాండుగంగ పోటీ చేయాలనుకున్నాడు. అయితే, ముగ్గురు సంతానం ఉండడంతో పోటీకి అనర్హుడు కావడంతో దురాలోచన చేశాడు. ఒక బిడ్డను తొలగించుకుంటే ఎన్నికల్లో పోటీకి అర్హత కలుగుతుందనే దురుద్దేశంతో, కేరూర్ ప్రస్తుత సర్పంచ్ గణేశ్ శిండేతో కలిసి ప్రణాళికలు రూపొందించాడు. తొలుత కుమారుడ్ని ఎవరికైనా దత్తత ఇవ్వాలని భావించాడు. కానీ, అప్పటికే బాలుడి బర్త్ సర్టిఫికెట్ జారీ కావడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు.
చివరకు పెద్ద కూతురు ప్రాచి (6) చంపేసి, తప్పిపోయిందని ప్రచారం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గత నెల 29వ తేదీన పాండురంగ ప్రాచికి మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపు వద్దకు వచ్చాడు. ఇక్కడి నిజాంసాగర్ డీ-46 కెనాల్లోకి పాపను తోసేసి వెళ్లిపోయాడు. అయితే, కాలువలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తండ్రి పాండురంగతో పాటు కేరూర్ సర్పంచ్ గణేశ్ శిండేను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన బోధన్ రూరల్ సీఐ విజయబాబు, ఎడపల్లి, రెంజల్ ఎస్సైలు ముత్యాల రమ, చంద్రమోహన్, కానిస్టేబుళ్లు బాబురావు, సుదీర్, శ్రీకాంత్‌ను సీపీ అభినందించడంతో పాటు పారితోషికం అందజేశారు.