నిజామాబాద్ క్రైం, సెప్టెంబర్ 9: సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్సైపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ నెల 5న ముఖ్యమంత్రి నిజామాబాద్ నగరంలోని నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు వచ్చినప్పుడు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సీఎం పర్యటనను ప్రతిపక్ష పార్టీల నాయకులు అడ్డుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్, నిఘా వర్గాల సూచనల మేరకు పలువురు నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారనే పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ మీదుగా సమీకృత కలెక్టరేట్‌కు వెళ్తుండగా ఓ కాంగ్రెస్ కార్పొరేటర్ సీఎం కాన్వాయ్కి అడ్డుపడడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఖంగుతిన్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు శాఖ, ఇంటెలిజెన్స్ వర్గాలు వెంటనే విచారణ చేపట్టాయి. నగర సీఐ కృష్ణ, త్రీ టౌన్ ఎస్సై సాయినాథ్ ఉన్నతాధికారులను బురిడీ కొట్టించారని అధికారులు తెలుసుకున్నారు. సీఎం పర్యటనకు ఒక రోజు ముందు రాత్రి సదరు కార్పొరేటర్‌ను అదుపులోకి తీసుకున్నట్లుగా తప్పుడు నివేదిక అందజేసినట్లు గుర్తించారు. సీఎం భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నగర సీఐ, త్రీ టౌన్ ఎస్సైపై పోలీస్‌శాఖ వేటు వేసింది. ఇద్దరిని నిజామాబాద్ వీఆర్‌కు బదిలీ చేస్తూ రేంజ్ ఐజీ కమల్‌హాసన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.