కంఠేశ్వర్, మార్చి 18 : సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌ను ముట్టడించిన అంగన్వాడీలపై పోలీసులు జులుం ప్రదర్శించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై బల ప్రయోగం చేయడం అనేక విమర్శలకు తావిచ్చింది. మహిళలని కూడా చూడకుండా కాళ్లు చేతులు పట్టి లాక్కెళ్లడంతో పలువురు గాయపడ్డారు. అయినప్పటికీ ఏమాత్రం భయపకుండా అంగన్వాడీలు ఆందోళన కొనసాగించడంతో గంటన్నరకు పైగా ఉద్రిక్తత కొనసాగింది. చివరకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు వచ్చి మాట్లాడడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు కొద్దిరోజులుగా పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదు. ఈ క్రమంలో మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్‌ను ముట్టిడించారు. ఉదయం 9.30 గంటలకే కలెక్టరేట్ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. తమ సమస్యలకు సమాధానం దొరికే వరకు కదిలేది లేదని అంగన్వాడీ ఉద్యోగులు బీష్మించుకుని కూర్చున్నారు. దీంతో లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో కలెక్టరేట్ ఉద్యోగులు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. పోలీసులు వచ్చి ఆందోళన విరమించాలని నచ్చజెప్పేందుకు యత్నించగా మహిళా ఉద్యోగులు తామ గోడు వెల్లబోసుకున్నారు.
తమ ఇక్కట్లను ఏకరువు పెట్టిన అంగన్వాడీలు ప్రభుత్వ తీరు పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారు తమను కనీసం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశా రు. మేము చేసేది పని కాదా? మేము మనుషులం కాదా? మాకు కుటుంబాలు లేవా? చాలీచాలని వేతనాలు ఇస్తే ఎట్లా బతికేదని వాపోయారు. రూ.13 వేల జీతంతో పిల్లలను ఎలా పోషించాలని ప్రశ్నించారు. కనీస వేతనం రూ.26వేలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చేది అరకొర వేతనం.. అది కూడా నెలల తరబడి ఇవ్వకపోతే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన జీతం ఇవ్వకపోగా పని పేరిట తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నారని వాపోయారు. ఫోన్ యాప్ తీసుకువచ్చి, ఇబ్బందులు పెడుతున్నారని, యాప్ పని చేయకపోయినా మెమోలు ఇచ్చి జీతాలు కట్ చేస్తున్నారన్నారు. ఫోన్ యాప్ తొలగించాలని, ఫొటో క్యాప్చర్ తీసివేయాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి, మార్చి 18 : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డిలో అంగన్వాడీ టీచర్లు కలెక్టరేట్ ఎదుట 48 గంటల మహాధర్నా చేపట్టారు. అంగన్వాడీ టీచర్ల 23 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌లోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో అదనపు కలెక్టర్ విక్టర్ వచ్చి మాట్లాడారు. ఆయనకు వినతి పత్రం ఇచ్చారు.
శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలను సముదాయించేందుకు పోలీసులు యత్నించారు. అయితే, కలెక్టర్ వచ్చి తమ సమస్యలు ఆలకించే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు స్పష్టం చేశారు. దీంతో వారిపై పోలీసులు బల ప్రయోగానికి దిగారు. సీఐటీయూ నాయకులను బలవంతంగా తరలిస్తుండగా, మహిళా ఉద్యోగులు అడ్డుకున్నారు. వారిపై పోలీసులు జులం ప్రదర్శించారు. ఒక్కొక్క ఉద్యోగినిని నలుగురైదుగురు పోలీసులు చుట్టుముట్టడంతో వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మహిళలని కూడా చూడకుండా కాళ్లు చేతులు పట్టి పశువులను లాక్కెళ్లినట్లు లాక్కెళ్లారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. తమ సమస్యలు తీర్చే వరకూ కదిలేది లేదని, ప్రాణాలు పోయినా లెక్క చేయమని ఉద్యోగులు కంటతడి పెట్టడం అక్కడున్న వారిని కలిచి వేసింది. చివరకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అక్కడకు రావడంతో గంటన్నరకు పైగా కొనసాగిన ఉద్రిక్తత చల్లారింది. అంగన్వాడీలు తమ గోసను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యలు పరిష్కరించాలని చేతులెత్తి వేడుకున్నారు.
బిల్లులు రాకపోవడంతో మస్తు పరేషాన్ అయితుంది. పది నెలల నుంచి హౌస్ రెంట్ రావటం లేదు. కూర గాయల బిల్లు ఇవ్వట్లేదు. రిటైర్మెంట్ అయిన టీచర్స్ ఇప్పటివరకూ ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు. ప్రభు త్వం అంగన్వాడీలను పూర్తిగా విస్మరించింది.
ఎన్నికల ముందర రేవంత్‌రెడ్డి మస్తు హామీలు ఇచ్చిండ్రు. జీతాలు పెంచుతామని, రెగ్యులరైజ్ చేస్తామని మాట చెప్పిండ్రు. మొన్న ఈ మధ్య చలో హైదరాబాద్ నిర్వహించినప్పుడు కూడా పెంచుతామని హామీ ఇచ్చిండ్రు. కానీ ఇప్పటి దాకా ఏమీ చేయలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఏం లాభం లేదని విసుగు వచ్చి గిట్ల రోడ్డెక్కాల్సి వచ్చింది.
ప్రభుత్వం మా సమస్యలు పట్టించు కోక పోవడంతోనే రోడ్డుపైకి వచ్చాం. సమస్యలు పరిష్కరించాలని మేము శాంతి యుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు దౌర్జన్యంగా లాక్కెళ్లి వ్యాన్లలో పడేశారు. మా హక్కులు మేము అడి గితే ఇంత దౌర్జన్యం చేస్తారా? సమ స్యలు పరిష్కరించ కుంటే ప్రభు త్వానికి తగిన బుద్ధి చెబుతాం.