వినాయక నగర్, ఏప్రిల్, 23 : తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య జిల్లాలో ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి అవగాహన కల్పించేందుకు బుధవారం నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ట్రాఫిక్, సివిల్ పోలీస్ సిబ్బందితోపాటు స్పెషల్ పార్టీ బలగాలతో తనిఖీలు నిర్వహించారు.
ట్రాఫిక్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో, ట్రాఫిక్ ఎస్ఐ సుమన్ హెల్మెట్ లేని వారిని గుర్తించి వారికి అవగాహన కల్పిస్తున్నారు. వాళ్లలో మార్పు కోసం తనిఖీలలో పట్టుబడిన వెంటనే వాహనదారులతో తక్షణమే హెల్మెట్ కొనిపించి అక్కడి నుండి వాహనదారుడిని పంపిస్తున్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ ఆవశ్యకత మీద వాహనదారులకు అవగాహన సైతం కల్పిస్తున్నారు. పెనాల్టీలు వేయడం మా అభిమతం కాదు, మీ రక్షణే మా ధ్యేయమని వాహనదారులకు పోలీసులు వివరిస్తున్నారు.