శక్కర్ నగర్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పోలీసులు నిర్బంధ తనిఖీలు (Cordon Search) నిర్వహించారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని బసవతారక నగర్లో ప్రతి ఇంట్లో విస్తృత తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 110 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, ఒక కారును సీజ్ చేశారు. అదేవిధంగా ఓ ఇంట్లో 35 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీఐ వెంకట నారాయణ సూచించారు. పట్టణంలో నూతన వ్యక్తులు, అపరిచితులకు ఆశ్రయం కల్పింబొద్దని చెప్పారు.
అదేవిధంగా వాహనాలను మైనర్లకు ఇవ్వొద్దని, వారికి ఇచ్చినట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయన్నారు. దీనివల్ల మైనర్‌తోపాటు వాహన యజమానిపై కూడా కేసులు నమోదు అవుతాయని తెలిపారు. కేసుల కారణంగా వారి భవిష్యత్తు దెబ్బతింటుందని వెల్లడించారు. ప్రజలు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉంచేందుకు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్టెన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించినట్లు ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ, రూరల్ ఎస్‌ఐలతోపాటు డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.