వినాయక్‌నగర్, నవంబర్, 11: ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రైల్వే పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం రోజు నిజామాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి, ఆర్పీఎఫ్ సిబ్బంది రైల్వేస్టేషన్‌లోని ప్లాట్ ఫామ్, ప్రయాణికుల లగేజ్‌తో పాటు పార్సల్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు.
ప్రయాణికుల వెయిటింగ్ హాల్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే పోలీస్ అధికారులు మాట్లాడుతూ పై అధికారుల ఆదేశాల మేరకు అప్రమత్తమై తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.