ధర్పల్లి, అక్టోబర్ 9: పాఠశాలకు మొబైల్ తీసుకువచ్చాడని ఓ ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థిపై పోలీసులకు ఫిర్యాదు చేయడమేకాకుండా, టీసీ ఇచ్చిన ఘటన మండలంలోని దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో వెలుగుచూసింది. విద్యార్థి, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్ర కారం.. మండలంలోని సల్పబండ తండాకు చెందిన రామావత్ చరణ్ దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో ఇటీవల నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో చరణ్ మొబైల్ తీసుకెళ్లి స్నేహితులతో కలిసి ఫొటోలు దిగుతుండగా..హెచ్ఎం శశికళ ఆగ్రహించి లాక్కున్నారు.
మరుసటి రోజు చరణ్ తల్లి నీలా తన కుమారుడితో కలిసి పాఠశాలకు వెళ్లి తప్పు జరిగిందని, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని మొబైల్ ఇవ్వాలని హెచ్ఎంను ప్రాధేయపడ్డారు. హెచ్ఎం వారిని పట్టించుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యార్థిని స్టేషన్‌కు తీసుకెళ్లి భయం చెప్పి, బాగా చదువుకోవాలని తిరిగి పంపించారు. దసరా సెలవుల అనంతరం బుధవారం చరణ్ పాఠశాలకు వెళ్లగా హెచ్ఎం నీవు పాఠశాలకు రావద్దని, టీసీ ఇచ్చి చేతిలో పెట్టింది. విద్యార్థి కుటుంబీకులు పాఠశాలకు వెళ్లి హెచ్ఎంను ప్రాధేయపడినా ఇంటికి పంపించేశారు.
విషయం తెలుసుకున్న గిరిజన తండా నాయకులు, ఏఐబీఎస్ఎస్ డివిజన్ అధ్యక్షుడు శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో గురువారం పాఠశాలకు వెళ్లారు. హెచ్ఎం ఎన్నికల విధుల్లో ఉండడంతో ఇన్చార్జి హెచ్ఎంతో ఫోన్లో మాట్లాడించినప్పటికీ విద్యార్థిని పాఠశాలలో చేర్చుకునేందుకు ఆమె నిరాకరించారు. తెలిసీ తెలియక చిన్న పొరపాటు చేసిన విద్యార్థిని మందలించి, సర్ది చెప్పాల్సిన హెచ్ఎం కక్ష గట్టినట్లు వ్యవహస్తున్నారని గిరిజన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎంపై ఎంఈవోతోపాటు డీఈవోకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ విషయమై హెచ్ఎం శశికళను వివరణ కోరగా క్రమశిక్షణలో భాగంగానే ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వారు చనిపోతామంటూ తనను బెదిరించడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.