Traffic rules | వినాయక నగర్,మే 18: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కమిషనరేట్ పరిధిలో ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ద్విచక్ర దారులు హెల్మెట్ ధరించడం, త్రిబుల్ రైడింగ్ చేయకూడదని, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపే వారిని అదుపు చేయడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ ఎప్పటికప్పుడు సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం ఓ బైక్ పై ఇద్దరు యువకులు హెల్మెట్ ధరించకుండా మితిమీరిన వేగంతో నడుపుతూ వెళ్లడాన్ని పోలీస్ కమిషనర్ స్వయంగా చూసి, వారిని చేంజ్ చేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఆ బైకును వెంబడించి పట్టుకు వచ్చిన సిబ్బంది వారిని సిపి ముందు హాజరు పరిచినట్లు తెలిసింది. దీంతో సీపీ ఆదేశాల మేరకు ఇద్దరు యువకులు హెల్మెట్ ధర్మించి వాహనాలు నడపాలంటూ ప్ల కార్డు చేతిలో పట్టుకొని మూడు గంటల పాటు డ్యూటీ చేయాల్సిందిగా ఆర్డర్ వేశారు.
దీంతో ఆదివారం రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మూడు గంటల వరకు ధర్నా చౌక్ లో ఒకరు, జిల్లా కోర్టు చౌరస్తా వద్ద మరొకరు ఇద్దరు యువకులు ప్లా కార్డులు పట్టుకొని రోడ్డు పక్కన నిలబడి ప్రచారం చేశారు. సిపి ఆదేశాల మేరకు నిబంధన అతిక్రమించిన వారి పై ఇలాంటి చర్యలు ఉంటాయని ట్రాఫిక్ సీఐ ప్రసాద్ వెల్లడించారు.