నిజామాబాద్ క్రైం, ఆగస్టు 28 : నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో టాస్క్‌ఫోర్స్ టీమ్ తనిఖీలు చేపట్టింది. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న డీసీఎంను వెంబడించిన టాస్క్‌ఫోర్స్ టీమ్‌కు స్మగ్లర్లు ముప్పతిప్పలు పెట్టారు. రైస్ స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ టీమ్ వదిలిపెట్టకుండా వెంబడించగా.. స్మగ్లర్లు సినీఫక్కీలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ జిల్లా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా పరిధిలోని ఆర్మూర్ ఏరియా నుంచి ఓ డీసీఎంలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ టీం తమ వాహనంలో డీసీఎంను వెంబడించారు. స్మగ్లర్స్ టాస్క్‌ఫోర్స్ టీముకు చిక్కకుండా బాల్కొండ వద్ద ఉన్న టోల్‌గేట్‌ను సైతం ఢీ కొట్టి తప్పించుకొని పారిపోయారు. డీసీఎంను ఎలాగైనా పట్టుకోవాలని టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటేశ్ ఆర్మూర్ నుంచి బాల్కొండ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ ఏరియాల్లో ఉన్న చెక్‌పోస్టుల వద్ద పోలీసులు రోడ్లపై బారికేడ్లను ఏర్పాటుచేశారు. రైస్ స్మగ్లర్లు వెహికిల్‌ను ఆపకుండా బారికేడ్లను ఢీకొట్టి ముందుకు దూసుకుపోయారు. టాస్క్‌ఫోర్స్ టీమ్ తమ వాహనాన్ని సైతం వేగంగా నడుపగా.. డీసీఎంలో నుంచి రైస్ స్మగ్లర్లు పోలీసుల వాహనంపైకి కారం పొడి చల్లుతూ వేగంగా వెళ్లారు.
డీసీఎంను తప్పించేందుకు మరో కారులో..
అక్రమ బియ్యం స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు మరో కారులో డీసీఎం వ్యానును టాస్క్‌ఫోర్స్ టీమ్‌కు దొరకకుండా తప్పించే ప్రయత్నం చేశారు. చివరకు టాస్క్‌ఫోర్స్ టీమ్ తమను వదిలిపెట్టరని గ్రహించిన ఆ స్మగ్లర్లు.. డీసీఎంను బాల్కొండ ఏరియాలో వదిలేసి పారిపోయారు. వాహనంలో తనిఖీలు చేపట్టగా.. 150 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. డీసీఎంను సీజ్ చేసి బాల్కొండ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. లారీడ్రైవర్‌ను సాజిద్‌గా గుర్తించారు. సాజిద్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారని టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటేశ్ తెలిపారు. పరారీలో ఉన్న నలుగురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.