డిచ్పల్లి/వినాయక్‌నగర్, మే 3 : నిజామాబాద్ జిల్లాలో ఇద్దరిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. డిచ్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఆరేండ్ల బాలికపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడగా.. జిల్లాకేంద్రంలో ఓ బాలికను యువకుడు ట్రాప్ చేశాడు. వృద్ధుడితోపాటు యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదుచేసి, రిమాండ్‌కు తరలించారు. డిచ్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆరేండ్ల బాలికపై 65 ఏండ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
మూడు రోజుల క్రితం వృద్ధుడు ఓ బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయం బాలిక కుటుంబీకులకు శుక్రవారం తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ బాలిక తన బంధువుల ఇంటికి రైలులో వెళ్తుండగా మహారాష్ట్ర లోని ధర్మాబాద్‌కు చెందిన అర్బాజ్ అనే యువకుడు(లేబర్) మాటామాట కలిపి పరిచయం చేసుకున్నాడు. ఏడాది కాలంగా ప్రేమపేరుతో వెంటబడిన సదరు యువకుడు, వారం రోజుల క్రితం బాలికను తన వెంట తీసుకువెళ్లాడు.
బాలిక ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్‌హెచ్‌వో రఘుపతి కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను వెంటబెట్టుకొని వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్న నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సదరు బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించి, యువకుడిపై శనివారం పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.