వినాయక్‌నగర్, నవంబర్ 22 : ఆడపిల్లకు రక్షణ లేకుండా పోయింది. బయటే కాదు, ఇంట్లోనూ భద్రత కరువైంది. వావీ వరుసలు మరిచి తోబుట్టువే తోడెలుగా మారి అమాయక బాలికను వంచించిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. అఘాయిత్యానికి గురైన బాలికకు గర్భస్రావం కావడంతో అసలు విషయం బయటపడింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ నగరంలో నివాసముండే ఓ బాలిక కడుపు నొప్పితో బాధపడుతున్నది.
కుటుంబ సభ్యులు ఆమెను దవాఖానకు తీసుకెళ్లగా, వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలికకు గర్భస్రావమైందని గుర్తించారు. బాలిక నెల రోజుల గర్భం దాల్చిందని, అబార్షన్ కావడంతో రక్తస్రావమై కడుపు నొప్పి వచ్చిందని వెల్లడించారు. గర్భం దాల్చడానికి కారణమెవరని బాలికను ప్రశ్నించగా.. ఊహించని సమాధానం రావడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. తన తోడబుట్టిన వాడే ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పడంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. ఏం చెప్పాలి, ఎవరితో చెప్పుకోవాలన్న మనోవేదనతో వారు కుమిలిపోయారు. అఘాయిత్యానికి పాల్పడిన వాడు కొడుకైన సరే.. తగిన బుద్ధి చెప్పాలని బాధితురాలి తండ్రి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో యువకుడిపై పోక్సో నమోదు చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు.